Hyderabad SIR: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలోని లోపాలను సరి చేయటంతో పాటు బోగస్ ఓట్ల ఏరివేతకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చాలా నెమ్మెదిగా కొనసాగుతుంది. గత నెల 25వ తేదీన మొదలైన ఈ సర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 2వ తేదీ వరకు సుమారు 47 లక్షల 36 వేల మంది ఓటర్లందరికీ ఇంటింటికెళ్లి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఫారం-6,7,8 లను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆశించిన స్థాయిలో విధులు నిర్వర్తించకపోవటంతో ఇంకా ఇంటింటికి ఫారాల పంపిణీ ప్రక్రియ ముగియలేదు. ఇంటింటికి ఫారాలు పంపిణీ చేసేందుకు జాప్యం జరుగుతుండటంతో ఫారాల పంపిణీకి ఎన్నికల సంఘం ఈ నెల 7 వరకు గడువు పెంచాల్సి వచ్చింది.
ఆ తేదీ నాటికి కూడా ఫారాల పంపిణీ పూర్తి కాకపోవటంతో ఈ నెల 11వ తేదీ వరకు ఫారాల పంపిణీ ఖచ్చితంగా పూర్తి చేయాలని, 12 నుంచి కేవలం పూరించిన ఫారాలు మాత్రమే స్వీకరించి, ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల సంఘానికి అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో సిటీలోని ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఇంకా సగం శాతం మంది ఓటర్లకు ఫారాలు అందలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఫారాలను అందజేసినా, వాటిని ఎలా పూరించాలి, ఎలాంటి సమాచారమివ్వాలి, సర్ 2002 కు సంబంధించిన ఓటరు వివరాలు అందుబాటులో లేకుండా ఏం చేయాలన్న ఓటర్ల సందేహాలను నివృత్తి చేసే అధికారులు కరవయ్యారు.
ముషీరాబాద్ వంటి నియోజకవర్గంలో స్థానికంగా నివాసముండే బూత్ లెవెల్ ఆఫీసర్లు కొందరు ఓటర్లు తమ ఇంటికి వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని, వాటిని పూరించిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు తీసుకువచ్చి ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ దృష్టికి రావటంతో ఆయన సర్ ప్రక్రియపై బుధవారం నుంచి ఆకస్మిక క్షేత్ర స్థాయి పర్యటనలు, ప్రక్రియ జరుగుతున్న తీరుపై తనిఖీలు మొదలు పెట్టారు. గత నెల 25వ తేదీన ప్రారంభమైన సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 14 రోజులు గడిచినా, ఇంకా ఫారాల పంపిణీ పూర్తి కాకపోవటంతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ బూత్ లెవెల్ ఆఫీసర్లపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రతి ఓటరుకు ఇంటికెళ్లి ఎన్యుమరేషన్ ఫారంతో పాటు కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6, ఓటును తొలగించుకునేందుకు ఫారం-7 ను, ఒక నియోజకవర్గంలోని ఓటరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ను పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవటంతో ఇప్పటి వరకు నూటికి నూరు శాతం ఇంటింటికి ఫారాలు అందలేదు.
ఈ క్రమంలో ఓటరుకు ఫారం పూరించటంలో సహకరించేందుకు 15 నియోజకవర్గాల్లో ఒక్కోక్కటి చొప్పున, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో హెల్ప్ డెస్క్ తో కలిపి మొత్తం 16 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. కానీ వీటి వల్ల ఓటర్లకు ఆశించినంత ప్రయోజనం సమకూరటం లేదని వీటిని సందర్శించిన కొందరు ఓటర్లు వాపోయారు. ఈ హెల్ప్ డెస్క్ లలో ఫారాలు అందుబాటులో లేకపోగా, మరికొన్నింటిలో సందేహాలను నివృత్తి చేసే స్థాయి అధికారి అందుబాటులో లేకపోవటంతో ఈ హెల్ప్ డెస్క్ లు ఓటర్లకు హెల్ప్ లెస్ డెస్క్ లుగా మారాయని ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: విజయవాడ నుంచి వారణాసి, కోల్‌కతాకు డైరెక్ట్ ఫ్లైట్స్.. ఇండిగో బిగ్ సర్‌ప్రైజ్!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి కీలకమైన, బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండటం, అందుబాటులో లేకపోవటంతో ఓటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, సర్ 2002 సమాచారం కోసం వివిధ పొలిటికల్ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా నాలుగు ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎంఐఎం, కాంగ్రేస్, బీఆర్ఎస్ పార్టీలు సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 4062 పోలింగ్ స్టేషన్లకు 10 వేల 901 మంది ఏజెంట్లను నియమించారు.
ప్రధాన పార్టీల వద్ద దశాబ్దాల క్రితం నుంచి ఓటరు జాబితాలు అందుబాటులో ఉండటంతో సర్ 2002 సమాచారాన్ని ఓటర్లకు అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్ల ఫారాలు పూరించటంతో పాటు సర్ 2002 సమాచారాన్ని కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు పూరించి, ఓటరు ఫొటో డిక్లరేషన్ తో బూత్ లెవెల్ ఆఫీసర్ కు సమర్పిస్తున్నారు. ఓటు బ్యాంక్ ను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియను చేపడుతున్నా, ఈ విధులను నిర్వర్తించాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్లు నిబద్ధతతో విధులు నిర్వర్తించకపోవటం వల్లే తాము బూత్ లెవెల్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నామని ఓటర్లు చెబుతున్నారు.