Pocharam Dam: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు అనేక జిల్లాలను ముంచెత్తుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
పోచమ్మ రాల్ వరదల్లో 50 మంది గ్రామస్తులు
పోచారం డ్యామ్ పరిసరాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పోచమ్మ రాల్ వద్ద వరదల్లో చిక్కుకున్న సుమారు 50 మంది గ్రామస్తులను రక్షించేందుకు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగారు. భారీ తాడును ఉపయోగించి, లైఫ్ జాకెట్లు ధరించిన జవాన్లు ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలు కామారెడ్డి పట్టణాన్ని పూర్తిగా ముంచెత్తాయి.
పొంగిపొర్లుతున్న కామారెడ్డి పెద్ద చెరువు
జీ.ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోని బట్టలు, వస్తువులు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు రహదారులు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు కామారెడ్డి పెద్ద చెరువు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సహాయక సిబ్బందిని సంప్రదించాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Fighter Jet Crashes: కూలిన ఎఫ్-16 యుద్ధ విమానం.. స్పాట్‌లోనే పైలట్ మృతి
మంజీరా వరదల్లో చిక్కుకున్న 8 మంది
ఇక నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామంలో మంజీరా నదిలో వరదల్లో చిక్కుకున్న 8 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవంతంగా రక్షించాయి. తాడులు, బోట్లు ఉపయోగించి ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వరద నీటిలో సంతోషి మాత ఆలయం
ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదలడంతో గోదావరి ప్రవాహం మరింత పెరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్న సంతోషి మాత ఆలయంలోకి కూడా వరద నీరు చేరింది. భక్తులు స్నానం చేయకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
వరదలపై సీఎం రేవంత్ సమీక్ష
నేడు సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మరోసారి సమీక్ష చేపట్టనున్నారు. ఆస్తి, పంట, ప్రాణ నష్టాలపై అధికారులతో సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తూ పరిస్థితిని నేరుగా పరిశీలిస్తున్నారు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదిక పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
https://Twitter.com/bigtvtelugu/status/1961282272230801617