Sobhita Akkineni: శోభితా ధూళిపాళ ఒకప్పుడు ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలిసింది కాదు. కానీ, ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్య ప్రేమిస్తున్నాడు అని తెలిసిందో అప్పటినుంచి శోభితా మీద తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారి శోభితా అక్కినేని ఇంటి కోడలిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు శోభితా ఎలా ఉంది అనేది పక్కన పెడితే పెళ్లి తర్వాత అక్కినేని కోడలుగా ఎలా ఉంటుంది అనేదాని మీద అందరూ దృష్టి పెడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
శోభితా సైతం పెళ్లి తర్వాత అక్కినేని కోడలుగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది అనే పేరును తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. సాధారణంగా అక్కినేని ఇంటి కోడళ్లు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతారు అనేది వినికిడి. అమల సైతం పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక నాగచైతన్యను మొదటి వివాహం చేసుకున్న సమంత సినిమాలకు దూరం కాలేదు. కానీ, లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సై అంటూ అద్భుతమైన చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు చైను రెండో వివాహం చేసుకున్న శోభితా సైతం సినిమాలకు దూరం కాకుండా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అక్కినేని ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క మంచి మంచి కథలను ఎంచుకుంటూ నటిగా తన సత్తా చూపించడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం శోభితా అక్కినేని ఒక వెబ్ మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్ మూవీస్ కి ఎక్కువ విజయాలు దక్కుతున్న విషయం విదితమే. శోభితా సైతం అదే బాటలో నడుస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అమెజాన్ ఒరిజినల్ మూవీగా ఒక వెబ్ మూవీ తెరకెక్కుతుంది. శరణ్ కొప్పిశెట్టి ఈ వెబ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్ తో కిర్రాక్ పార్టీ అనే సినిమాను తెరకెక్కించి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శరణ్ ఆ తర్వాత సత్యదేవ్ తో కలిసి తిమ్మరుసు అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సత్యదేవ్ తోనే ఫుల్ బాటిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇక ఇప్పుడుశోభితాతో ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయనున్నాడు శరణ్. ఇక ఈ వెబ్ మూవీకి చీకట్లో అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వెబ్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుందని, అమెజాన్ ప్రైమ్ లో దాదాపు 18 భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. ఓటీటీలో ఇన్ని భాషల్లో ఒక సినిమాను డబ్ చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. మరి పెళ్లి తర్వాత అక్కినేని కోడలు చీకట్లో సినిమాతో భయపెడుతుందా లేదా అనేది చూడాలి.