IPS Suicide Case: ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు తీవ్రమవుతున్నాయి. యువకుల నుంచి ఓ మోస్తరు స్థాయి వ్యక్తుల వరకు ఆత్మహత్యలు లేకుంటే హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. తాజాగా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన ఆత్మహత్యకు కారణాలేంటి? సీనియర్ల ఒత్తిడి కారణమా? ఏమైనా పర్సనల్ వ్యవహారాలా? ఇలా రకరకాలుగా చర్చ మొదలైంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి సూసైడ్
హర్యానాలో ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ పురాణ్ కుమార్ ఆత్మహత్యపై మిస్టరీ కొనసాగుతోంది. అక్టోబర్ 7న చండీగఢ్‌లోని తన ఇంట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాయితీకి మారుపేరుగా ఆయనకు మంచి పేరు ఉంది. దీంతో కుమార్ మృతిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆయన రాసిన తొమ్మిది పేజీల ఇప్పుడు అధికారుల్లో కలకలం రేపుతోంది.
దీనిపై పోలీసులు మౌనం వహించడం, పోస్టుమార్టం వాయిదా వేయడంపై రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. కుమార్ భార్య అమ్మీత్ కుమార్ ఐఏఎస్ అధికారి. రీసెంట్‌గా సీఎం నయాబ్ సింగ్ సైనీ టీమ్ జపాన్ వెళ్లింది. అందులో కుమార్ భార్య అమ్మీత్ కూడా ఉన్నారు. పురాన్‌కుమార్ ఆత్మహత్యకు ముందు నోటుతోపాటు ఓ లేఖను భార్యకు పంపినట్టు వార్తలు వస్తున్నాయి.
కుమార్ భార్య సీఎం టూర్‌లో ఉండగా
వెంటనే భర్తకు జపాన్ నుంచి ఆమె ఫోన్ చేశారని, ఎలాంటి స్పందన లేకపోవడంతో తన కుమార్తెకు ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. షాపింగ్ కు వెళ్లిన ఆమె, ఇంటికి వచ్చేసరికి తండ్రి మృతి చెందినట్టు చెబుతున్నారు కొందరు అధికారులు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో పురాన్ కుమార్ సూసైడ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది.
సూసైడ్ నోట్‌లో పురాన్‌కుమార్ తనతో కలిసి పని చేస్తున్న అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా 12 మంది పేర్లు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వారి నుంచి మానసిక వేధింపులు, పక్షపాతం, కుల వివక్ష ఆరోపణలు చేశారట. అలాగే డీజీపీపై ఆరోపణలు చేసినట్టు వార్తలు లేకపోలేదు. సొంత శాఖ అధికారులు తనను నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
ALSO READ: పెళ్లయిన నాలుగు నెలలకే.. భార్యని చంపి మంచం కింద పెట్టి
గురువారం మధ్యాహ్నం జపాన్ నుంచి నేరుగా చండీగఢ్‌కు చేరుకున్నారు కుమార్ భార్య అమ్మీత్ కుమార్. సెక్టార్ 24లోని తన అధికారిక నివాసానికి ఆమె వెళ్లారు. ఇంటి నుంచి నేరుగా ఆమె ఆసుపత్రిలోని మార్చురీకి చేరుకున్నారు. అయితే మీడియాకు ఆమె దూరంగా ఉన్నారు. మీడియా మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు చేతులు జోడించి, కంటతడి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పూర్తి దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. బుధవారం పోస్టుమార్టంకు అమ్నీత్ అంగీకరించలేదని, అక్టోబర్ 9న పెద్ద కుమార్తె అమెరికా నుండి తిరిగి వచ్చిన శవపరీక్షతో పాటు అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల పురాన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా? మరేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆయన మొబైల్ తోపాటు పలు వస్తువులను పరిశీలించారు దర్యాప్తు అధికారులు.