They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలోతెరకెక్కిన చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసాయి.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు తెరపడింది. సెప్టెంబర్ 25 న OG థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమాలోని లిరికల్ వీడియోస్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఫైర్ స్ట్రామ్ అంటూ రిలీజ్ అయిన సాంగ్ రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెల్సిందే.
ఇక తాజాగా OG నుంచి ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. సువ్వి సువ్వి సువ్వాలమ్మా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గంభీర, కన్మణిగా పవన్, ప్రియాంక కనిపించారు. ఇక సాంగ్ ఎంత బావుందో.. వీడియోలో విజువల్స్ కూడా అంతే అందంగా ఉన్నాయి. కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్.. థమన్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే.. శృతి రంజని మెస్మరైజ్ చేసే వాయిస్ మరో ఎత్తు. ఎంతో మధురంగా ఆమె వాయిస్ వినిపిస్తుంటే సాంగ్ విన్నంతసేపు చాలా ఆహ్లదకరంగా అనిపిస్తుంది అని చెప్పొచ్చు.
గంభీర, కన్మణి పెళ్లి తరువాత గడిపే మధుర క్షణాలను ఈ సాంగ్ లో చూపించారు. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కోనేటి వద్ద ఈ జంట దీపాలు వదిలే షాట్ లో ప్రియాంక ఎంత అందంగా అనిపించిందో పవన్ కూడా అంతే అందంగా కనిపించాడు. పవన్ ను ఇంత రొమాంటిక్ క్యారెక్టర్ లో చూసి చాలా కాలమైందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.