Ramayana: రామాయణ, మహాభారత ఇతిహాస కథలను తెరపై ఎవరు ఎన్ని విధాలుగా చూపించినా.. వీటికి మాత్రం ఎప్పటికప్పుడు మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా డైరెక్టర్స్ తమ తెలివితేటలను ఉపయోగించి.. ఎవరికి వారు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రామాయణ ఇతిహాస గాధ పైన ఎన్నో సినిమాలు వచ్చినా.. మళ్లీ ఇప్పుడు అదే రామాయణం పై బాలీవుడ్ లో మరో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇక రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా.. మొదటి భాగం వచ్చే యేడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. సాధారణంగా ఒక కథను రెండు భాగాలుగా చెప్పాల్సి వచ్చినప్పుడు.. మొదటి భాగం ఎక్కడ ముగిస్తారు? అన్నది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే రామాయణ మొదటి భాగం కూడా ఎక్కడ ఎండ్ కానుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఇప్పుడు దానిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
రామాయణ ఫస్ట్ పార్ట్ ముగిసేది అక్కడే..
రాముడికి సీత జాడ గురించి జటాయువు ఇచ్చే సందేశంతో మొదటి పార్ట్ ను ముగిస్తారట. దీనిపై చిత్ర బృందం స్పందిస్తూ..” రామాయణ మొదటి భాగం జటాయువు మరణంతో ముగుస్తుంది. ఈ జటాయువుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వాయిస్ ఓవర్ ఇస్తారు. ఈ సన్నివేశంతో సీతాదేవిని ఎవరు అపహరించారో రాములవారికి తెలుస్తుంది. అసలు యుద్ధం పార్ట్ 2 లో ఉంటుంది” అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే మొదటి భాగాన్ని ఎక్కడ ఎండ్ చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పడమే కాకుండా కీలకమైన జటాయువుకు బిగ్ బి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని చెప్పి అంచనాలు మరింత పెంచేసింది చిత్ర బృందం.
రామాయణ సినిమా విశేషాలు..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా ఇందులో నటిస్తున్నారు. దాదాపు రూ.4వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ (Nitish Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ (Yash ) నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రావణుడి క్రూరత్వం, రాక్షసత్వం మాత్రమే కాదు ఆయనలోని దయ గుణాన్ని కూడా ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించనున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను కూడా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రావణబ్రహ్మ నేపథ్యాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని అంశాలతో ఈ పాత్రను తెరపై ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వచ్చిన రామాయణ కథలు ఒక ఎత్తు.. ఇప్పుడు రాబోతున్న రామాయణ కథ ఇంకొక ఎత్తు అంటూ నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చారు.
ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలనేదే నా లక్ష్యం – నిర్మాత
తాజాగా దీనిపై నిర్మాత నమిత్ మల్హోత్రా (Namith Malhotra) మాట్లాడుతూ.. “ప్రపంచమంతా ఈ రామాయణ ఇతిహాసాన్ని చూడాలనే ఒకే ఒక లక్ష్యంతోనే సుమారుగా రూ.4వేల కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నాము. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలకు అయ్యే ఖర్చు కంటే ఇది ఏ మాత్రం తక్కువ కాదు. తరాలు మారినా.. యుగాలు మారినా.. రామాయణం ఎప్పటికీ ఒక గొప్ప ఇతిహాసమే.. ఈ సినిమాతో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు మరింత విలువ పెరుగుతుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నాను” అంటూ తన అభిప్రాయంగా ఆయన చెప్పుకొచ్చారు.