Telangana: తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు అందించే పథకాలతో పాటు మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ కొత్త పథకం ద్వారా లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ది పొందనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, రుణమాఫీ లాంటి గొప్ప పథకాలను అమలు చేస్తుంది. వీటితో పాటు పండించిన పంటలతో రైతు నష్టపోకుండా గిట్టుపాటు ధరలను వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, యంత్రాలు కొనుగోలులో సబ్సిడీని కూడా అందిస్తోంది. అయితే తాజాగా మరో కీలక పథకాన్ని రైతులకు అందించేందుకు సిద్ధమైంది.
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. రైతులకు ఎకరానికి 9600 సబ్సిడీ రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతు కళ్ళల్లో ఆనందం చిగురించనుంది. అయితే ఈ సబ్సిడీ మొత్తం ఏ ఏ పంటలపై అమలవుతాయి. ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో ఉంటున్న జనాభాకు అవసరమైనంత కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలోనే వినూతన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 10,000 ఎకరాలలో కూరగాయల సాగు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అందుకోసం రైతు మొత్తం పెట్టుబడిలో 40% సబ్సిడీ కింద ఇచ్చేందుకు సిద్ధమైంది.
సాధారణంగా ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయలను సాగు చేయొచ్చని ప్రభుత్వానికి ఉద్యాన శాఖ అధికారులు ఒక నివేదికను అందచేశారు. దీనికి సుమారు ఎకరాకు 24,000 రూపాయలు ఖర్చువుతుందని తెలిపారు. ఈ పెట్టుబడిలో 40% అనగా 9600 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి తక్షణమే కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి రైతులను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.
Also Read: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..
ఈ సబ్సిడీని పొందాలంటే రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారి దగ్గర తాము పండించే పంటకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తును పరిశీలించి రైతుల జాబితాను తయారు చేస్తారు. ఆ తర్వాత ఉద్యాన శాఖకు సంబంధించిన నర్సరీల నుంచి లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి 40% అనగా 9,600 రైతుల ఖాతాలో జమ చేసేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రెండున్నర ఎకరాల్లో సాగు చేసే పంటకు మాత్రమే ఈ సబ్సిడీని వర్తించనుంది. ఉదాహరణకు ఐదు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తే అతనికిరెండున్నర ఎకరాల సాగుకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.