Vijay Deverakonda Ticket Prices:కరోనా పుణ్యాన వరల్డ్ సినిమా అరచేతిలోకి వచ్చేయడంతో ఆడియన్స్ థియేటర్ల మొహాలే చూడటం మానేశారు.ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీస్ థియేటర్ల వైపు అడుగులు వేయాలంటే పెద్ద యుద్ధమే అన్నట్టుగా అయిపొయింది.అయినప్పటికీ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచండి మహాప్రభో అని ప్రభుత్వాల చుట్టూ మేకర్స్ చక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
సినిమాకి వెళ్ళడం అంటే ఒక పండగ
ఇప్పుడంటే అబ్బా…అంతంత ఖర్చు పెట్టి సినిమాలకి వెళ్ళాలా అని తలబాదుకుంటున్నాం.కానీ ఒకప్పుడు సినిమాకి వెళ్ళడం అంటే ఒక పండగ.ముఖ్యంగా ఫ్యామిలీస్ అంతా హైదరాబాద్ లోని ఐమాక్స్ లో సినిమా చూడటం అంటే ఒక మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్‌పై సినిమా చూస్తే వచ్చే కిక్కు మాములుగా ఉండేది కాదు. మరో ముఖ్యమైన విషయం అప్పట్లో ఐమ్యాక్స్ టికెట్ ధర కేవలం రూ.80 ఉండేది మరి.
ఇక కాలేజీ కి వెళ్ళే యూత్ అంతా ఆ 80 రూపాయల కోసం ఇంటి నుంచి రోజూ ఖర్చులకు ఇచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం దాచుకుని,అలా వారం రోజుల పాటు ఖర్చులు తగ్గించుకుని మరీ టికెట్ కొనుక్కుని సినిమాలు చూసిన వాళ్ళు.అలా ఎంతో కష్టపడి టికెట్ సంపాదించి, పెద్ద స్క్రీన్‌పై సినిమా చూసిన ఆనందం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.
ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి
అయితే కాలం మారేకొద్దీ సినిమా టికెట్ ధరలు కూడా పెరిగిపోయాయి.ఒకప్పుడు రూ.80 ఉన్న టికెట్ ధర రూ.100కి చేరితేనే సినిమా చూడాలంటే ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఇంకా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే టికెట్ రేట్లు పెంచడం చాలా కామన్ అయిపొయింది. దీంతో కామన్ ఆడియన్స్ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ హైక్ అనేది ఎంత భారమో చెప్పక్కర్లేదు. ఇంట్లో నలుగురు కలిసి సినిమా చూడాలనుకుంటే టికెట్లకే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి.
ఇక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్, పార్కింగ్ ఖర్చులు కలిపితే గుండె గుబెల్ మంటుంది. అందుకే సినిమా చూడాలనే కోరిక ఉన్నా రేట్లకి బయపడి ఓటీటీ లోకి వచ్చాక చూసుకుందాం లే అనుకునే వాళ్ళే ఎక్కువ.
ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన
ఇదిగో సరిగ్గా ఈ మిడిల్ క్లాస్ వారికి పెద్ద రిలీఫ్ ఇస్తూ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు ఉండదనే మాట వినిపిస్తుంది. తెలంగాణలో తమ సినిమాలకు రేట్లు పెంచకుండా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన ఉందని, అయితే రాజమౌళితో సినిమా చేస్తే మాత్రం మినహాయింపు ఉంటుందని తెలుస్తుంది.
నిజానికి విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెల్సిందే .ఇక ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో హడావుడి మామూలుగా ఉండదు. ఫస్ట్ డే షోలు, ఫ్యాన్స్ సందడి, థియేటర్ల దగ్గర పండగ వాతావరణం పక్కా .
అలాంటి సమయంలో టికెట్ ధరలు సాధారణంగా ఉంటే అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకు వచ్చే అవకాశాలు పుష్కలం.ఇక సినిమా బాగుందనే టాక్ వస్తే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కూడా.
ఈ దసరాకు థియేటర్లలో మాస్ జాతర
ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ సినిమా గురించి కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈ దసరాకు థియేటర్లలో మాస్ జాతర చూపిస్తామనే ప్రచారం అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. పండగ రోజుల్లో సినిమాలని థియేటర్ లలో చూడాలనుకునే వారే ఎక్కువ.అలాంటిది టికెట్ రేట్స్ పెంచకుండా ఉంటే ఇక థియేటర్స్ ఎలా జాతరగా మారిపోతాయో చెప్పక్కర్లేదు.
సినిమా అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు. అభిమానులకు అది ఒక ఎమోషన్ అని చెప్పక్కర్లేదు. అభిమాన హీరోను పెద్ద తెరపై చూడటం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, కుటుంబంతో సరదాగా గడపడం.. ఇవన్నీఅందులో భాగమే. అందుకే టికెట్ ధరలు ఎంత తక్కువ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి అంత ఇష్టపడతారు.
ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్
మొత్తానికి, విజయ్ దేవరకొండ సినిమాల టికెట్ ధరలపై జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. నిజంగా కామన్ ఆడియన్స్ ఎలాంటి భారం లేకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదనే చెప్పాలి.