Zubeda Ali:గుండె సమస్య నుండి బయటపడిన స్టార్ కమెడీయన్ అలీ భార్య జుబేదా అలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చారు.తన పెళ్లి గురించి,పిల్లల కోసం తాను చూసిన ఎదురుచూపుల గురించి జుబేదా అలీ చెప్పిన ఈ విషయాలే ఇపుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
అలీతో పెళ్లి ఎలా జరిగిందంటే?
అలీతో తన వివాహం ఎలా కుదిరిందో ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది జుబేదా.తన పెద్దనాన్న సినీ రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసేవారని, అప్పట్లో మోహన్ బాబు, శోభన్ బాబు వంటి నటులకు దుస్తులు డిజైన్ చేసేవారని చెప్పారు.
ఆ సమయంలో అలీని దగ్గరగా గమనించిన తన పెద్దనాన్నకు ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చిందట. సినిమా రంగంలో ఉన్నప్పటికీ పెద్దలను గౌరవించడం, మంచి అలవాట్లు కలిగి ఉండటం చూసి తన తండ్రికి అలీ గురించి చెప్పారట.
ఇక అప్పటికి తాను పదో తరగతి చదువుతున్నానని,ఆ సమయంలో తనకి పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా, అలాంటి మంచి అబ్బాయి దొరకడం కష్టమని పెద్దనాన్న చెప్పడంతో అలీ సంబంధం గురించి ఆలోచించారని, అలా అలీతో తన వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఇక చదువులో తాను అంతగా రాణించలేదని, పదో తరగతి పరీక్షలు రెండుసార్లు ఫెయిల్ అయ్యాక మూడోసారి పాస్ అయ్యానని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు జుబేదా.పెళ్లి తర్వాత సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లినప్పుడు, అలీ భార్యగా తనను గుర్తించిన ఉపాధ్యాయులు సన్మానించారని చెప్పారు. అలీని తమ పాఠశాలకు తీసుకురావాలని కూడా కోరడంతో మరుసటి ఏడాది ఆయనను తీసుకెళ్లి అందరినీ కలిపించానని తెలిపారు.
పిల్లల కోసం నాలుగేళ్లు ఎదురుచూసిన జుబేదా..
అయితే పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టకపోవడంతో నాలుగేళ్లపాటు ఎంతో మానసిక వేదన అనుభవించానని తెలిపారు జుబేదా. చిన్నప్పటి నుంచి పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, కానీ డాక్టర్స్ ని అప్రోచ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెప్పడంతో ఎంతో బాధ పడ్డానని చెప్పుకొచ్చారు.
ఇక ఆ సమయంలో ఎన్నో ఆసుపత్రులకు తిరిగానని, మందులు వాడటంతో పాటు దర్గాలకు వెళ్లడం, ప్రార్థనలు చేయడం ఇలా చేయని ప్రయత్నం లేదని చెప్పారు. చివరకు ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని వాపోయారు.
ఇక అదే సమయంలో అలీ మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోతే ఏమైంది.. నువ్వు నాకు బిడ్డవి, నేను నీకు బిడ్డను. మనం ఒక చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుందామని చెప్పారని ఆ మాటతో జుబేదాలో కొంత ధైర్యం వచ్చిందని, పిల్లల కోసం పడుతున్న టెన్షన్ ని పక్కన పెట్టేసినట్టు తెలిపారు.
అయితే మొదటి బిడ్డ పుట్టినప్పుడు కూడా అలీ షూటింగ్ కారణంగా వెంటనే రాలేకపోయారట. సింగపూర్‌లో షూటింగ్ ఉండటంతో పాప పుట్టిన ఏడు రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. వచ్చినా కేవలం గంటసేపు ఉండి తిరిగి షూటింగ్‌కు వెళ్లిపోయారని గుర్తుచేసుకున్నారు.
రెండో బిడ్డ విషయంలో ప్రాణాల మీదకు
ఇక మొదటి పాప పుట్టిన పదేళ్ల తర్వాత రెండోసారి గర్భం దాల్చినప్పుడు మరోసారి కష్టాలు ఎదురయ్యాయని జుబేదా తెలిపారు. ఎనిమిదో నెలలో ఉండగా అలీ షూటింగ్ కోసం బయటకు వెళ్లారట. అదే సమయంలో తనకు తీవ్రంగా నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్స్ టెస్ట్స్ చేసి బిడ్డ మూమెంట్స్ లేవని, తల్లి ప్రాణాల కోసం వెంటనే సిజేరియన్ చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఆ సమయంలో అలీకి ఫోన్ చేసినా షూటింగ్లో బిజీగా ఉండటంతో వెంటనే మాట్లాడలేకపోయారని చెప్పారు.
చివరకు విషయం తెలిసిన అలీ.. బిడ్డ కంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని, అవసరమైతే డాక్టర్స్ చెప్పినట్లు చేయమని ధైర్యం చెప్పారట. అలా ముందుగానే డెలివరీ జరగడంతో చిన్నగా పుట్టిన బాబును కొన్నిరోజుల పాటు డాక్టర్స్ అబ్జర్వేషన్ లోనే ఉంచారని వివరించారు.
ఇప్పుడు ఆ బాబే నేషనల్ లెవల్ బాక్సర్‌గా ఎదగడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పిల్లల విషయంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కుటుంబం అంతా కలిసి వాటిని ఓవర్ కమ్ చేశామని గుర్తుచేసుకున్నారు జుబేదా .
ALSO READ :మొదట్లో జోరు..ఇప్పుడు బేజారు!.ఆదర్శకుటుంబం ఇక అంతేనా?