
Satyendar Jain : మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. గురువారం ఉదయం ఆయన జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అధికారులు ఆయను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితిని ఆప్ ట్విటర్‌లో వెల్లడించింది. గతంలో ఇలాగే ఓసారి బాత్‌రూమ్‌లో పడిపోయారని తెలిపింది. ఆ సమయంలో వెన్నెముకకు తీవ్ర గాయమైందని వెల్లడించింది. గత సోమవారం కూడా సత్యేందర్ జైన్ అస్వస్థతకు గురయ్యారు. అప్పడు కూడా జైలు అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బయటికొచ్చిన ఫోటోలు ఆప్ నేతలను కలవరానికి గురిచేశాయి. జైన్ బాగా చిక్కి పోయారు. చాలా నీరసంగా కన్పించడంతో ఆప్ నేతలు ఆందోళన చెందారు.
కొంతకాలంగా వెన్నెముక సమస్యతో జైన్ బాధపడుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు బెయిల్‌కు ప్రయత్నించారు. కానీ ఆయనకు బెయిల్ లభించలేదు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఫిటిషన్ దాఖలు చేశారు. జైల్లో ఉన్న సమయంలో జైన్ 35 కిలోల బరువు తగ్గారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ అత్యవసర విచారణ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది.