Ahmedabad Flower Show: గుజరాత్ రాష్ట్రం మరోసారి విశ్వవేదికపై తన సత్తా చాటుతూ అరుదైన ఘనత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ ఫ్లవర్ షో, వరుసగా మూడవ సంవత్సరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించింది. తనదైన సృజనాత్మకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పుష్ప ప్రదర్శన, 2026 సంవత్సరానికి గాను ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
ఈ ఏడాది ప్రదర్శనలో రెండు అద్భుతమైన నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల పూలతో అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దిన ‘ప్రపంచంలోనే అతిపెద్ద పూల మండలం’ (Largest Floral Mandala) మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో రూపొందించిన ‘అతిపెద్ద పూల చిత్రం’ (Largest Floral Portrait) ద్వారా ఈ ఏడాది రెండు రికార్డులు నమోదయ్యాయి. గతంలో 2024లో ప్రపంచంలోనే ఎత్తైన పూల నిర్మాణం ద్వారా, 2025లో అతిపెద్ద పూల బొకే ద్వారా రికార్డులు సృష్టించిన ఈ ఫ్లవర్ షో, తాజా విజయాలతో గిన్నిస్ రికార్డుల పరంపరలో హ్యాట్రిక్ సాధించి నిర్వాహకుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ అద్భుత విజయంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గుజరాత్ సృజనాత్మకతకు, నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనమని, వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను, పౌరులను అభినందించారు. ఈ ఫ్లవర్ షో కేవలం పూల ప్రదర్శన మాత్రమే కాదని.. సృజనాత్మకత, ప్రకృతి ప్రేమ సమాజ భాగస్వామ్యానికి ప్రతీక అని ప్రధాని కొనియాడారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, జాతీయ ఐక్యతను చాటుతూ ప్రపంచ వారసత్వ నగరమైన అహ్మదాబాద్‌కు ఈ వేడుక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోందని ఆయన ప్రశంసించారు.
Read Also: Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలు ఈమేనా?.. అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం