Modi Comments : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోవడంతో అవినీతి వ్యతిరేకి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు పెద్ద ఊరట కలిగించి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తర్వాత దిల్లీ పీఠాన్ని అందుకున్న బీజేపీ.. గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. దిల్లీలో బంపర్ మెజార్టీని అందుకున్న సందర్భంగా.. దిల్లీలోని కేంద్ర బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్టీ గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. కేజ్రీవాల్ పై అనేక విమర్శలు గుప్పించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అక్రమాలను చూస్తూ అనేక ఏళ్లుగా అన్నా హజారే ఆవేదన చెందుతుంటారన్న ప్రధాని మోదీ.. ఇప్పుటి ఫలితాలతో ఆయనకు కొంత ఊరట కలిగుంటుంది అన్నారు. ఫిబ్రవరి 8న వెలువడిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత దిల్లీలో అధికారాన్ని తిరిగి పొందింది. వరుసగా మూడు సార్లు దిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆప్.. ఈ సారి ఘోరంగా 22 స్థానాలకు పరిమితమైంది. 2020 ఎన్నికల్లో 62 స్థానాలను గెలిచిన ఆప్, ఈసారి భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవడం.. ఆప్ పార్టీపై ఉన్న వ్యతిరేకతకు అద్ధం పడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
దిల్లీ ఎన్నికల అనంతరం.. అన్నా హజారే స్పందించారు. ఆప్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు మంచి వ్యక్తిత్వం, విలువలు, నైతికత అవసరమని తాను చెబుతూ వచ్చానని.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తన మాటలను పట్టించుకోలేదని అన్నారు. వారు మద్యం, డబ్బు వివాదాల్లో చిక్కుకున్నారని, ఆర్వింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడతారు, కానీ వాస్తవంలో అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. ఈ కారణంగానే.. ప్రజలు అర్వింద్ కేజ్రీవాల్ ను ఈ ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు.
ఈ అంశాన్నే తన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ.. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ చివరకు అవినీతిలోనే మునిగిపోయిందని చురుకలు అంటించారు. ఆ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి ఆరోపణల కారణంగా జైలుకు వెళ్ళడం దురదృష్టకరమన్నారు. ఇది దిల్లీ ప్రజలపై జరిగిన అతిపెద్ద మోసమన్న ప్రధాని మోదీ.. నిజాయితీ కోసం పోరాడుతున్నట్లు చూపించుకున్న వారు, చివరికి దేశంలోనే అత్యంత అవినీతిపరులుగా మారిపోయారని విమర్శలు గుప్పించారు.
కేజ్రీవాల్ నాయకత్వంలో దిల్లీలో జరిగిన అనేక అవినీతి ఆరోపణలపై విమర్శలు చేసిన ప్రధాని మోదీ.. మద్యం కుంభకోణం కారణంగా దిల్లీ పరువు పోయిందన్నారు. స్కూల్, ఆసుపత్రుల స్కామ్ ల వల్ల పేద ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. అలాగే.. ఆప్ నేతల అహంకారం అమితంగా పెరిగిపోయిందని ఆగ్రహించారు. కరోనా సమయంలో, దేశం మొత్తం మహమ్మారిని ఎదుర్కొంటున్న వేళ, వీరు మాత్రం ప్రభుత్వ నిధులతో ‘శిశు మహల్’ నిర్మించుకోవడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు.
Also Read : ఢిల్లీ ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు.. ఇక మేం ఏంటో చూపిస్తాం: ప్రధాని మోదీ
ఆప్ నేతల అవినీతి విషయమై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సైతం తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమే అన్న ఆయన.. వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత నేతలదే అని స్పష్టం చేశారు. ఆప్ ఏర్పాడినప్పటి నుంచి ఆ పార్టీ విధానాలు తనకు నచ్చలేదన్న అన్నా హజారే.. అందుకే తాను ఆ పార్టీలో చేరలేదని వ్యాఖ్యానించారు. కానీ.. సామన్య ప్రజలు నిజాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.