BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ ఎడ్యూరప్పకు హైకోర్టులో స్మాల్ రిలీఫ్. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. కాకపోతే ఈ కేసును శాశ్వతంగా కొట్టివేయడానికి మాత్రం నిరాకరించింది. అరెస్ట్ కాకుండా మాత్రమే ఆయనకు ఉపశమనం కలిగింది. ఇంకా మెడపై కేసు అనే కత్తి వేలాడుతూనే ఉంది.
ఇంతకీ మాజీ సీఎం ఎడ్యూరప్పపై పోక్సో కేసు ఏంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే.. గత సార్వత్రిక ఎన్నికల ముందు మాజీ సీఎం ఎడ్యూరప్పపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది ఫిబ్రవరి రెండున ఓ కేసులో బాధితురాలు మాజీ సీఎంను కలిసింది. తనపై నమోదైన కేసులో సాయం చేయాలని వేడుకుంది.
అదే సమయంలో తనతో వచ్చిన 17 ఏళ్ల కుమార్తెను బలవంతంగా రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఎడ్యూరప్పపై సదాశివనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీ విచారణ చేస్తోంది. అయితే ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల క్యాన్సర్‌తో మృతి చెందింది.
అంతకుముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ నమోదు చేసింది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు చివరకు కర్ణాటక హైకోర్టుకు చేరింది. పలుమార్లు మాజీ సీఎంకు విడతల వారీగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ: మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం
శుక్రవారం ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎడ్యూరప్పపై పోక్సో కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దర్యాప్తు, తుది నివేదిక చెక్కుచెదరకుండా ఉన్నాయని తీర్పు చెప్పింది. ఈ కేసును ట్రయల్ కోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది.
విచారణ సందర్భంగా ఎడ్యూరప్ప తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుకు సంబంధించి తల్లి, ఆమె కుమార్తె గతంలో తనను సంప్రదించారని వాదించారు. ఆ వాదనలను సీఐడీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. కేవలం ముందస్తు బెయిల్ మాత్రమే మంజూరు చేశారు.