Delhi IGI Airport:ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఆలస్యం నడుస్తున్నాయి. పీటీఐ నివేదిక ప్రకారం.. నవంబర్ 6వ సాయంత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సాంకేతిక సమస్య కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని దిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పనిచేస్తున్నారని ఎయిర్ పోర్టు అధికారులు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు డేటాను అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆటోమేటెడ్ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఎయిర్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న సమాచారంతో విమానాల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేస్తున్నారు. దీంతో విమానాల రాకపోకలకు ఆలస్యం ఏర్పడుతుంది. దిల్లీ విమానాశ్రయంలో సగటున 50 నిమిషాలకు పైగా రాకపోకలు ఆలస్యం అవుతుందని ఫ్లైట్ ట్రాకర్ వెబ్ సైట్ పేర్కొంది. విమానాల ఆలస్యంతో పలు విమాన సంస్థలు అడ్వైజరీ జారీ చేశాయి.
“దిల్లీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య కారణంగా అన్ని విమాన సంస్థల కార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. దీంతో విమానాలలో ఆన్ బోర్డింగ్ ఆలస్యం అవుతుంది. ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. విమానాశ్రయంలోని మా క్యాబిన్ సిబ్బంది, ఆన్-గ్రౌండ్ సిబ్బంది ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తక్షణ సహాయం అందిస్తున్నారు.
విమానాశ్రయానికి వెళ్లే ముందు https://airindia.com/in/en/manage/flight-status.html లో మీ విమాన ప్రయాణ స్థితిని ముందుగా చెక్ చేసుకోండి ” అని ఎయిర్ ఇండియా ఎక్స్ లో పోస్టు చేసింది.
ఇండిగో సంస్థ కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. “ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా దిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ఇండిగో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.
Also Read: Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు
సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని దిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని గంటల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఈ సమస్య కారణంగా లఖ్‌నవూ, జైపుర్, చండీగఢ్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుల్లోను విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి.