ISRO: ఇస్రోలో సంక్షోభం తారాస్థాయికి చేరిందా? కొద్దిరోజులుగా 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామాలు చేశారా? ఇప్పటికే చేపట్టిన కీలక మిషన్ల మాటేంటి? శాస్త్రవేత్తల రాజీనామాల వ్యవహారం కేంద్రం చెవిలో పడిందా? దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? తాజాగా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఇస్రోలో సంక్షోభం-భారత అంతరిక్ష సంస్థ ఊహించని సవాలును ఎదుర్కొంటోంది. ప్రయోగాలు విఫలమైనందుకు కాదు, సాంకేతిక వల్ల అంతకంటే కాదు. ఇస్రోలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడమే అసలు కారణం. కొన్ని నెలల్లో అంతరిక్ష సంస్థ నుండి 120 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా లేకుంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
120 శాస్త్రవేత్తలు రాజీనామా-గగన్‌యాన్, చంద్రయాన్-4 ప్రాజెక్టులకు రెడీ అవుతున్న సమయంలో సీనియర్ శాస్త్రవేత్తలు స్వచ్ఛంద రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. ఇస్రోలోని కీలక కేంద్రాలు తిరువనంతపురం- విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, బెంగళూరు- యూఆర్ రావు అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట-సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో టెలిమెట్రీ, ఎన్‌ఆర్‌ఎస్‌సీతో పాటు ఇస్రో అనుబంధ కేంద్రాల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు ఉన్నారు.
వారంతా కీలక మిషన్లలో శాస్త్రవేత్తలు-ఈ వ్యవహారం గురువారం జాతీయ మీడియాలో పుంఖాను పుంఖానుగా వార్తలు వచ్చాయి. పరిస్థితి గమనించిన కేంద్రం రంగంలోకి దిగింది. కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలను పరిమితం చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీనిద్వారా ఉద్యోగులు వెళ్లకుండా ఇస్రో కీలక విభాగాల అధిపతులు రంగంలోకి దిగి ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు.
శాస్తవేత్తలతో యూనిట్ అధిపతుల చర్చలు-శాస్త్రవేత్తల పదవీ విరమణలు, రాజీనామాలపై కఠినతరం చేస్తూ జూలై 14న ఓ అంతర్గత మెమో జారీ చేసింది. ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు, యూనిట్ అధిపతులు ఈ సమస్యను పరిష్కరించాలని పేర్కొంది. గగన్‌యాన్, ముఖ్యమైన మిషన్లతో సంబంధం ఉన్న వారి అభ్యర్థనలను అంగీకరించవద్దని అందులోని సారాంశం. ఇంజినీర్లు, శాస్త్రవేత్తల కంటే దిగువ ర్యాంకుల్లో రాజీనామాలు పరిశీలించిన తర్వాత ఆమోదించాలని ఆయా యూనిట్ల డైరెక్టర్లకు సూచించారు.
ఇస్రోలో ఉద్యోగులు సంస్థను విడిచి వెళ్లడం కొత్తేమీ కాదు. ప్రైవేట్ రంగంలో ఇచ్చే జీతాలకు దీటుగా ఇవ్వడానికి ఆ సంస్థ చాలాకాలంగా ఇబ్బందిపడుతోంది. ఐటీ, కమ్యూనికేషన్స్ రంగాల్లో అద్భుతమైన వృద్ధి, ప్రైవేట్ రంగం అందిస్తున్న అధిక జీతభత్యాల ప్యాకేజీలు కారణంగా ఉద్యోగులు ఇస్రోను విడిచి వెళ్లడానికి ప్రధాన కారణమని గతంలో మాజీ మంత్రి పృథ్వీరాజ్ చవాన్ పార్లమెంటుకు చెప్పిన విషయం తెల్సిందే.
ALSO READ: ఆస్తి కోసం కన్న తండ్రినే కాటేసిన కొడుకు.. ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
ఇస్రోలో వరుసగా ఉద్యోగులు సామూహిక రాజీనామాలపై కేంద్ర శాస్త్ర సాంకేతికమంత్రి జితేంద్రసింగ్ రియాక్ట్ అయ్యారు. పాలన వ్యవహారానికి సంబంధించిన విషయమని, ఇస్రోలోకి ఉద్యోగులు వస్తుంటారు, వెళ్తుంటారని అన్నారు. ప్రతి సంస్థలో ఇలాంటి సమస్య ఎదురవుతుందని వ్యాఖ్యానించారు ఇస్రో చైర్మన్ నారాయణన్.
కీలకమైన ప్రాజెక్టులపై రాజీనామాల ప్రభావం పడకుండా కొత్తవారికి బాధ్యతలు అప్పగించి జాగ్రత్త పడతామన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగడం రాజీనామాలకు కారణంగా తెలుస్తోంది. గతంలో చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 వంటి ప్రాజెక్టులను సక్సెస్ చేసిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ సోమనాథ్, చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ అంకుర సంస్థలో చేరినట్టు తెలుస్తోంది.
జీతాల విధానాన్ని చూసిన తర్వాత దాదాపు 60 శాతం మంది ఐఐటియన్లు ఇస్రో నుండి వెళ్లిపోయారని ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. ఐఐటి గ్రాడ్యుయేట్లలో కేవలం 1 శాతం మాత్రమే ఇస్రోను ఎంచుకుంటున్నారని తెలిపారు. 2020 లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్ వంటి అనేక స్టార్టప్‌లు దేశ ఏరోస్పేస్ సెక్టార్ స్వరూపాన్ని మార్చి వేశాయి. ఈ కంపెనీలు ఊహించలేని వేగంతో రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత సేవలను అభివృద్ధి చేస్తున్నాయి.