Chandigarh Politics: చండీగఢ్ కేంద్రంగా కొత్త రాజకీయాలు మొదలయ్యాయా? ఆ ప్రాంతాన్ని ఆర్టికల్ 240 తేవాలని కేంద్రం ఆలోచన చేస్తోందా? శీతాకాల సమావేశాల్లో బిల్లు తేవాలని ప్లాన్ చేసిందా? కేంద్రం నిర్ణయాన్ని అధికార ఆప్, విపక్ష కాంగ్రెస్ పార్టీలు తప్పుబడుతున్నాయా? ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి అడుగులు వేయనుంది? ఉత్తరాదిలో ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది.
చండీగఢ్ చుట్టూ కొత్త రాజకీయాలు
పంజాబ్-హర్యానా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చండీగఢ్. అయితే చండీగఢ్ పాలనా బాధ్యతలను పంజాబ్ గవర్నర్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే చండీగఢ్ ప్రాంతాన్ని ఆర్టికల్ 240 కిందకు తీసుకురావాలని భావిస్తోంది కేంద్రప్రభుత్వం. అదే చేస్తే ఆ ప్రాంతంపై పంజాబ్ గవర్నర్ పాత్ర బలహీనపడుతుందని అక్కడి ప్రభుత్వం ఆలోచన. ఆ ప్రాంతంపై రాష్ట్రపతి నియంత్రణ పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
చండీగఢ్ అధికారంపై డిసెంబర్‌లో జరగనున్న శీతాకాల సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం నిర్ణయంపై పంజాబ్‌లోని అధికార-విపక్షాలు భగ్గుమన్నాయి. ఇది ముమ్మాటికీ పంజాబ్ ప్రయోజనాలకు విరుద్ధమని తెగేసి చెబుతున్నాయి. చండీగఢ్ అధికారాలను పంజాబ్ నుంచి తొలగించేందుకు మోదీ సర్కార్ ఈ స్కెచ్ వేసిందని అంటున్నాయి.
కేంద్రం ప్రతిపాదనపై ఆప్-కాంగ్రెస్-అకాలీదల్ పార్టీలు ఆగ్రహం
చండీగఢ్ పరిపాలనా స్వరూపాన్ని మార్చేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ ప్రతిపాదన చేయనుంది. దీనికి సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనివల్ల చండీగఢ్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తోంది. ఆర్టికల్ 240 ప్రకారం రాష్ట్రపతికి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా చండీగడ్‌పై నేరుగా నిబంధనలను రూపొందించే అధికారం దక్కనుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై భగ్గుమన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. చండీగఢ్ నిత్యం పంజాబ్‌లో అంతర్భాగంగా ఉంటుందన్నారు. చండీగఢ్ నిర్మాణానికి మా గ్రామాలను ధ్వంసం చేశారని, దానిపై హక్కు కేవలం మాకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పారు. దీనిపై వెనక్కి తగ్గేది లేదన్నారు. పంజాబ్‌లోని అధికార ఆప్, విపక్ష కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ పార్టీల నేతలు ఇందుకు ససేమిరా అంగీకరించేది లేదని అంటున్నారు. ఈ సవరణను పంజాబ్ ప్రభుత్వం అనుమతించదని తేల్చేశారు.
ALSO READ: జైలుకి సరఫరా చేసే అరటిలో సిగరెట్లు-గంజాయి
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా కేంద్రం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. చండీగఢ్ పంజాబ్‌కు చెందినది, దానిని లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా తీవ్ర పరిణామాలను కలిగి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి దుస్సాహసం చేయకూడదన్నారు.
శిరోమణి అకాలీదల్ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా ఖండించారు. కేంద్రం ప్రతిపాదనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ 350వ అమరవీరుల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో కేంద్రం.. పంజాబ్ నుండి చండీగఢ్‌ను వేరు చేయడానికి కుట్ర పన్నుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
ఆప్-కాంగ్రెస్-అకాలీదల్ నేతల వాదనను తోసిపుచ్చింది పంజాబ్ బీజేపీ. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. చండీగఢ్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. పంజాబ్ పరిపాలనలో పెట్టుబడిదారులు అనిశ్చితంగానే ఉన్నారని పేర్కొన్నారు. యూటీ హోదాతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి, అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు.