ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్- 3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ల్యాండర్ విక్రమ్ చివరి డీ-బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయాన్ని ఇస్రో ప్రకటించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో జాబిల్లిపై ల్యాండర్ దిగుతుందని తెలిపింది.ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొంది.
ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని ఇస్రో ధీమా వ్యక్తం చేసింది. భారత శాస్త్రసాంకేతికత సామర్థ్యానికి నిదర్శనంగా ఈ ప్రక్రియ నిలుస్తుందని పేర్కొంది. ఈ విజయం యువతలో ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణలపై ఆసక్తిని పెంచుతుందని వివరించింది. అందుకే బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఇస్రో ప్రకటించింది. ఇస్రో వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్, డీడీ నేషనల్ టీవీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో విక్రమ్ ల్యాండర్ ల్యాండిగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సూచించింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం జులై 14న చంద్రయాన్-3ను ఇస్రో ప్రయోగించింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కిలోమీటర్లు, అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగనుంది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రష్యా ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్-3పై మరింత టెన్షన్ నెలకొంది.