Tamilnadu: అసలే శీతాకాలం.. రోడ్లపై కమ్మేసిన పొగ మంచు.. వాహనాలు జాగ్రత్తగా నడపకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై లారీ నుంచి CNG గ్యాస్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డ్రైవర్ సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో అదుపులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది?
దక్షిణాదిలో కెమికల్స్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్లాంట్ నుంచి వాహనాలు ప్రమాదకరమైన గ్యాస్‌ని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అసలే చలికాలం.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే సీజన్ కూడా. తాజాగా చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారిపై CNG ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని కూడపాక్కం సమీపంలో చోటు చేసుకుంది. టోరెంట్ గ్యాస్ గిడ్డంగి నుంచి మధురవాయల్‌కు వెళ్తోంది CNG లారీ ట్యాంకర్.
వాహనంలో సుమారు వెయ్యి కిలోల CNG గ్యాస్ ఉన్నట్లు సమాచారం. ఏం జరిగిందో తెలీదుగానీ, మార్గమధ్యంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం మొదలైంది. భారీ శబ్దంతో గ్యాస్ బయటకు రావడం మొదలైంది. అది ఎప్పటి నుంచి లీక్ అవుతుందో తెలీదు. అయితే మరోవైపు నుంచి వెళ్తున్న వాహనాలు.. లారీ ట్యాంకర్ అలర్ట్ చేశాయి. అప్పటికే రోడ్డుపై తెల్లటి పొగలా వ్యాపించింది గ్యాస్.
ఆలస్యం చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించిన వాహన డ్రైవర్, లారీని పక్కకు పెట్టి గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో గమనించడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ ప్రాంతమంతా గ్యాస్ తెల్లని పొగ మాదిరిగా కమ్మేసింది. ఈలోగా పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తొలుత జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేశారు. గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో డ్రైవర్‌తోపాటు అధికారులు క్షణ్నంగా పరిశీలించారు.
చివరకు వాల్వులను మళ్లీ బిగించడంతో గ్యాస్ లీక్ కావడం తగ్గింది. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సురక్షితంగా తరలించారు. దీని కారణంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. రహదారిపై ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతా ఓకే కావడంతో పెను ప్రమాదం తప్పింది. తమ ఇళ్లలో గ్యాస్ లీక్ అయ్యిందని ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టిన స్థానికులు చివరకు ఊపిరి పీల్చుకున్నారు. మూడు రోజుల కిందట కింద ఇలాంటి ఘటన జరిగింది. కరూర్ వద్ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. దీంతో ఆ ప్రాంతమంతా యాసిడ్ వ్యాపించింది. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి దాన్ని అదుపులోకి తీసుకొచ్చిన విషయం తెల్సిందే.