Secret Phone Recordings in Divorce Cases| భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణలకు గోప్యత ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే విడాకుల కేసులో న్యాయం కోసం ఆ సంభాషణలే కీలక సాక్ష్యాలుగా మారవచ్చా? భార్యకు తెలియకుండా భర్త రికార్డ్ చేసిన ఫోన్ కాల్స్‌ను విడాకుల కేసులో ఆధారాలుగా సమర్పించవచ్చా? ఈ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెనుక ఉన్న చట్టపరమైన అంశాలు, కోర్టు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యకు తెలియకుండా రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలను విడాకుల కేసులో సాక్ష్యాలుగా సమర్పించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన గత తీర్పును రద్దు చేసింది. ఈ రికార్డింగ్స్ సమర్పించడం వల్ల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
ఈ కేసులో భార్యాభర్తలకు 2009లో వివాహమైంది. 2011లో వారికి కుమార్తె జన్మించింది. వైవాహిక విభేదాల కారణంగా భర్త 2017లో విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
భర్త 2010, 2016 సంవత్సరాల్లో భార్యతో జరిగిన కొన్ని ఫోన్ సంభాషణలను రికార్డ్ చేశాడు. వాటిని మొబైల్ మెమరీ కార్డుల్లో భద్రపరిచాడు. అనంతరం వాటి సీడీలు కూడా సిద్ధం చేశాడు.
వాటిని అదనపు అఫిడవిట్‌తో పాటు సాక్ష్యాలుగా సమర్పించేందుకు అనుమతి కోరాడు. అయితే భార్య ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. రికార్డింగ్స్ తన గోప్యతకు భంగం కలిగిస్తాయని వాదించింది.
2025 జూలై 14న ఇచ్చిన 2025 INSC 829 తీర్పులో సుప్రీంకోర్టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 122 పరిశీలించింది. ఈ నిబంధన ప్రకారం.. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలను సాధారణంగా ఇతరులకు వెల్లడించకూడదు. అయితే భార్యాభర్తల మధ్య జరిగే న్యాయపరమైన వివాదాలకు దీనిలో మినహాయింపు ఉంది.
విడాకుల వంటి కేసుల్లో ఒకరి వాదనను నిరూపించేందుకు సంబంధిత సంభాషణలను సాక్ష్యాలుగా సమర్పించవచ్చని కోర్టు పేర్కొంది. న్యాయమైన విచారణ హక్కు కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమని వివరించింది.
Also Read: ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలు నివారించడానికి ఇలా చేయండి
వివాహ బంధంలో నమ్మకం కోల్పోయినప్పుడు ఒకరిపై మరొకరు నిఘా పెట్టడం సంబంధాల సమస్యకు సంకేతమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అయితే రికార్డింగ్ ఉందని మాత్రమే దాన్ని సాక్ష్యంగా అంగీకరించరు. దాని ప్రామాణికత, కచ్చితత్వం, వాటకి కేసుతో సంబంధం అనే అంశాలు కోర్టు పరిశీలించాలి. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు కూడా పాటించాలి.
Also Read: విడాకుల రోజే రెండో పెళ్లి.. కోర్టు తీర్పురాక ముందే చెల్లుబాటు అవుతుందా?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ తీర్పు వైవాహిక వివాదాల్లో డిజిటల్ సాక్ష్యాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసింది. సంబంధిత రికార్డింగ్స్ ద్వారా తమ వాదనలను నిరూపించుకునే అవకాశం ఇరు పార్టీలకు లభిస్తుంది.
అదే సమయంలో రహస్య రికార్డింగ్స్ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు అవసరం. వ్యక్తిగత గోప్యత, న్యాయమైన విచారణ మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది.