Bilkis Bano Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టి జైల్లో జీవత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేసి వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇద్దరు దోషులు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించటం, వారిలో ఒకరికి అంగవైకల్యం ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
2002లో గుజరాత్ లో అల్లర్లు చెలరేగిన సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు సహా కుటుంబంలోని 7 గురిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో 11మందికి ఐపీసీ 143, 147, 302 సెక్షన్ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాగా 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం 11మంది దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి జైలు నుంచి విడుదల చేసింది.
అయితే దీనిని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సుప్రీం కోర్టు కేసు విచారణ మహారాష్ట్రలో జరిగిన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదంటూ 2024 జనవరి 8న తేల్చి చెప్పింది. గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. దాంతో దోషులందరూ తిరిగి జైలుకు వెళ్లారు. అయితే జైలులో శిక్ష అనుభవిస్తున్న విపిన్ చంద్ర కన్హయ్యలాల్ జోషి, ప్రదీప్ రమణ్ లాల్ మోధియా సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్లు దాఖలు చేశారు. 2017లో బాంబే హైకోర్టు తమ జీవిత ఖైదును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు.
దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అప్పీళ్లలోని చట్టపరమైన, వాస్తవ అంశాలపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సంబంధిత ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి వీరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఇది వారిని నిర్దోషులుగా విడుదల చేయడం కాదని, కేవలం అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నందున శిక్షను సస్పెండ్ చేశామని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: బిగ్‌బీ హత్యకు భారీ కుట్ర.. ముంబై గ్యాంగ్‌స్టర్ ఓపెన్ వార్నింగ్.. 200 మంది అనుచరులతో స్కెచ్?
అంతకుముందు నిందితుల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా నిందితులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పైగా ఒకరి పేరు అసలు ఎఫ్ఐఆర్ లో లేదని చెప్పారు. ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత కేసులో ఇరికించారని వాదించారు. ఒక నిందితుడికి తీవ్రమైన వైకల్యం ఉందని కూడా పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజా థాక్రే బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. నేరం తీవ్రత దృష్ట్యా ట్రయల్ కోర్టు, హైకోర్టు అన్ని ఆధారాలను పరిశీలించే శిక్ష విధించాయని వాదించారు. అయితే సుప్రీంకోర్టు జైలు శిక్ష కాలాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చింది.
Also Read: BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!