Viral Video: యూపీలోని వారణాసిలో ఇద్దరు యువతులు టిఫిన్ సెంటర్ వద్ద బీభత్సం సృష్టించారు. హోటల్ పై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేస్తున్న వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లని.. గతంలో ఆ హోటల్ సిబ్బంది తమ తండ్రిపై దాడి చేశారన్న ఆగ్రహంతోనే ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
స్థానికుల కథనం ప్రకారం.. నవంబర్ 4న సదరు యువతుల తండ్రికి, హోటల్ సిబ్బందికి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా పెద్దదై హోటల్ సిబ్బంది ఆయనపై చేయి చేసుకున్నారు. దీనిపై బాధిత కుటుంబం భేలుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పోలీసుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఆ అక్కాచెల్లెళ్లు.. తామే స్వయంగా తేల్చుకోవాలని నిర్ణయించుకుని హోటల్ వద్దకు చేరుకున్నారు.
వీడియోలో ఇద్దరు యువతులు స్కూటర్‌పై హోటల్ వద్దకు రావడం కనిపించింది. రాగానే అందులో ఒకరు తమ ఫోన్‌తో హోటల్‌ను, పరిసరాలను వీడియో తీయడం మొదలుపెట్టారు. అంతలోనే మరో యువతి ఒక్కసారిగా హోటల్ వైపు దూసుకెళ్లి అక్కడ ఉన్న పిండి డబ్బాను కిందకు తోసేసింది. అంతటితో ఆగకుండా అక్కడున్న సిబ్బందిపై నీళ్లు చల్లుతూ ‘ఈ హోటల్‌ను వెంటనే మూసేయండి’ అంటూ గట్టిగా కేకలు వేసింది.
Two girls in Varanasi vandalised a dosa shop after their father was allegedly brutally beaten by the shop’s employees. With no police action for nearly two weeks, their frustration turned into anger. https://t.co/hQFlA6UCM6
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 16, 2026
ఈ ఆకస్మిక పరిణామంతో హోటల్ వద్ద ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారిలో ఒకరు ఆ మహిళలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. కాస్త ఆలోచించి ప్రవర్తించండి. ఎందుకిలా గొడవ చేస్తున్నారు?’ అని ఓ స్థానికురాలు ప్రశ్నించగా ఆ యువతి ఆమెను నోరు మూసుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు మరికొందరు లోకల్స్ కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న రెండో యువతి చేతిలోంచి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా.. ఆమె స్థానికులకు క్షమాపణలు చెప్పడం వీడియోలో కనిపించింది.
Also Read: బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
అయితే యువతులు ఎంతకీ వినకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హోటల్ యజమాని తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏసీపీ గౌరవ్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
Also Read: రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!