Cockroach Party: కాక్రోచ్ జనతా పార్టీ రూటు ఎటు? రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా? పోరాటాలను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారా? బుధవారం జరగనున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడనుంది? సీజేపీ మద్దతుదారులు మాత్రమే కాదు, రాజకీయాలు పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సీజేపీ అధినేత అభిజీత్ మనసులో ఏముంది? ఇప్పుడు చూద్దాం.
నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు నేతృత్వం వహించింది కాక్రోచ్ జనతా పార్టీ-CJP. చివరకు ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామాతో దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంది సోషల్ మీడియా పార్టీ. ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై ఆ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న అంటే బుధవారం ఆ పార్టీ కీలక సమావేశం జరగనుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అభిజీత్ దీప్కే నివాసంలో ఈ భేటీ జరగనుంది. దీనికి ఆ పార్టీకి చెందిన కీలక వ్యక్తులు హాజరవుతున్నాయి.
అంతకుముందు వాలంటీర్లు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని డిసైడ్ అయ్యింది ఆ పార్టీ. జంతర్ మంతర్ ఉద్యమంలో చాలామందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలి? విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణపై కేంద్రంపై ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి? దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తమ భవిష్యత్ వ్యూహాన్ని ప్రకటించవచ్చని చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జంతర్ మంతర్ నిరసన సమయంలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అభిజీత్ వెల్లడించారు.
జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దానిపై ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది అసలు ప్రశ్న. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే, తన మనసులోని మాట బయటపెట్టినట్టు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే, ఎంపీగా ఉండటం ఇష్టం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. తన గ్రామానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. రాజకీయ నేతలు, మంత్రులు ఆయనను కలవడానికి ఇంటికి వస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. దీప్కే అమెరికాలో చదువుతున్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. తనకు రాజకీయాలపై ఆశలేదని ఉండి ఉంటే.. తాను అమెరికా వెళ్లేవాడిని కాదని అన్నాడు.
ALSO READ: ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం సంతుక్ పింప్రికి సర్పంచ్ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గతంలో పలుమార్లు చెప్పినట్టు సమాచారం. తన గ్రామానికి ఏదైనా చేయాలని ఉందని, గ్రామ సర్పంచ్ కావాలనుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెబుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇది అప్పటికి ఆలోచన. ఢిల్లీలో ఆందోళన తర్వాత ఒక్కసారిగా అభిజీత్ పేరు మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న సమావేశంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.