Rs 100 bribe case| ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఇలా కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యమేస్తుంది. అలాంటి ఒక ఘటన తాజాగా ఝార్ఖండ్‌లో జరిగింది. 31 ఏళ్ల క్రితం కేవలం రూ.100 లంచం తీసుకున్నందుకు ఒక ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా ఆ వ్యక్తి ఇప్పుడు 75 ఏళ్ల వృద్ధుడు. చిన్న మొత్తంలో తీసుకున్న లంచం చివరకు మూడు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటంగా మారింది. అయితే, ఆయన వయసు, అనారోగ్యం, కేసు సాగిన సుదీర్ఘ కాలాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించింది.
కాళీ శంకర్ ధోబీ అనే వ్యక్తి 1995లో రాంచీలోని హటియా రైల్వే స్టేషన్‌లో పార్సెల్ క్లర్క్‌గా పనిచేశారు. నిర్మల్ కుమార్ బెగానీ ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌ను హటియా నుంచి బిహార్‌లోని సమస్తిపూర్‌కు పంపించాలని రైల్వే మార్గంలో పంపించాలని అనుకున్నారు. నిర్మల్ కుమార్ కథనం ప్రకారం.. ఆయన రైల్వే స్టేషన్ వెళ్లగా.. మోటార్‌సైకిల్ పార్సెల్ బుక్ చేసేందుకు కాళీ శంకర్ రూ.100 లంచం అడిగారు. దీంతో ఈ విషయాన్నినిర్మల్ కుమార్ ఫిర్యాదు చేశారు. చివరికి విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ బదిలీ అయింది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత సీబీఐ కాళీ శంకర్‌ని పట్టుకునేందుకు ఒక ప్లాన్ వేసింది. 1995 ఏప్రిల్ 27న సీబీఐ అధికారులు హటియా స్టేషన్‌లో వల పన్నారు. అలా రూ.100 లంచం తీసుకుంటున్న సమయంలో కాళీ శంకర్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తర్వాత ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు ప్రత్యేక కోర్టుకు వెళ్లింది. దాదాపు 9 ఏళ్ల విచారణ తర్వాత 2004లో తీర్పు వెలువడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కాళీ శంకర్ ధోబీకి ఏడాది జైలు శిక్ష విధించారు. అదే సెక్షన్ కింద రూ.4,000 జరిమానా కూడా విధించారు. సెక్షన్ 13(2) కింద మరో 18 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ సెక్షన్ కింద రూ.6,000 జరిమానా కూడా విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కాళీ శంకర్.. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత కేసు హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా విచారణ పూర్తవడానికి రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. జస్టిస్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ ఈ కేసును విచారణ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు కూడా కాళీ శంకర్‌ని దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పుని సమర్థించింది. అయితే, శిక్ష విషయంలో మాత్రం కోర్టు మార్పులు చేసింది.
Also Read: ‘రూ.11 సెలైన్ బాటిల్ రూ.325 ధరకు విక్రయం.. ఆస్పత్రిలో ప్రజలను దోచుకుంటున్నారు’
కాళీ శంకర్ ఇప్పుడు 75 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు దాదాపు 31 ఏళ్ల పాటు కొనసాగిన విషయాన్ని కూడా కోర్టు పరిగణించింది. సెక్షన్ 7 కింద ఉన్న ఏడాది శిక్షను ఆరు నెలలకు తగ్గించింది. సెక్షన్ 13(2) కింద ఉన్న 18 నెలల శిక్షను ఏడాదికి తగ్గించింది. 2 శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నాయి. అందువల్ల ఆయన గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష అనుభవించాలి. కాళీ శంకర్ కి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని కూడా కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ అంశాలు ఆయనపై ఉన్న దోష నిర్ధారణను రద్దు చేయడానికి సహాయపడలేదు.
ఈ కేసు కారణంగా నిందితుడు కాళీ శంకర్ ఇప్పటికే తన రైల్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు. తాజా తీర్పులో హైకోర్టు ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. రెండు నెలల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో 75 ఏళ్ల వయసులో కాళీ శంకర్ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
Also Read: మీరు వేగంగా నడుస్తారా లేదా మెల్లగా.. వాకింగ్ స్టైల్ మీ పర్సనాలిటీని తెలుపుతుంది..