MGNREGA Name Change: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు అన్నం పెట్టే పథకానికి గాంధీజీ పేరు తీసేసి, ‘జీరాంజీ’ అని పేరు పెట్టడం సరికాదన్నారు. పథకానికి కులమతాలను అంటగట్టడం, గాంధీజీని మరుగున పరచాలనుకోవడం తగదని హితవు పలికారు.
నిరసనలో భాగంగా కుమారి సెల్జా, ప్రణీతి షిండేతో సహా పలువురు విపక్ష ఎంపీలు పాత పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్-1 పైకప్పు ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలిపారు. మరోవైపు, ఈ అంశంపై స్పందించిన ఎంపీ ప్రియాంక గాంధీ.. కేవలం పేరు మార్పు వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఇది ప్రజాధనం వృథా తప్ప మరొకటి కాదని విమర్శించారు.
ఈ పరిణామాలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో తీవ్రంగా స్పందించారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపుతూ, ఫెడరల్ స్ఫూర్తిని మోదీ సర్కార్ దెబ్బతీస్తోందని మండిపడ్డారు. గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ నేతలు తాము గాడ్సే వారసులమని నిరూపించుకుంటున్నారని పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉపాధి హామీ చట్టాన్ని తుదముట్టించాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రేపు (డిసెంబర్ 17న) అన్ని జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు ప్రతి మండలం, గ్రామంలో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసనలు చేపడతామని వెల్లడించారు. ఇది కేవలం ఒక బిల్లును వ్యతిరేకించడం మాత్రమే కాదని, కోట్లాది మంది గ్రామీణ పేదల మనుగడ, గౌరవం, ఆశలకు సంబంధించిన పోరాటమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్