Delhi CM Swearing In | దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంచుకుంటుంది, ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుంది అనే అంశాలపై జాతీయ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై బిజేపీ తీవ్రంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో కలిసారు. నిన్న సాయంత్రం బిజేపీ విజయోత్సవ వేడుకల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక కీలక నేతలు ఈ అంశంపై చర్చించగా, ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త సీఎం ఎంపిక విషయంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని బిజేపీ నాయకులు విస్తృత సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, సీఎం ఎంపిక విషయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అనుసరించిన రాజకీయ వ్యూహాన్ని ఢిల్లీకి కూడా అనుసరించవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో దిగిన బిజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా అనేక కీలక నేతలు ఎన్నికైన ఎంపీలతో ఆదివారం సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ఈ అంశంపై చర్చలు జరిగినట్లు అనేక ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించాయి.
Also Read: ఆప్‌ని ఓడించాలంటే ప్రధాని మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది.. కేజ్రీవాల్ వైరల్ వీడియో
ఢిల్లీ సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఢిల్లీ బిజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ, జాతీయ కార్యదర్శి దుష్యంత్, మాజీ అధ్యక్షులు విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, గౌతంతో పాటు బిజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ పేర్లు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాయి. పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ గత ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
మరోవైపు, గత అనుభవాలను పరిశీలిస్తే, 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గత ఏడాది ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం ఎంపిక తీరును బట్టి ఊహాగానాలకు అవకాశం తక్కువగా ఉంది. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్, రాజస్థాన్లో భజన్లాల్ శర్మ, ఒడిశాలో మోహన్ చరణ్ మాఝీలను సీఎం పదవులకు ఎంపిక చేసిన బిజేపీ, రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సందర్భంగా బిజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీ కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ తమకు కేటాయించిన బాధ్యతలను నిర్వర్తించగలిగేవారేనని కూడా అన్నారు.
అయితే, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు, ప్రధాని మోదీ ఈ నెల 10నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు. అవి ముగించుకుని తిరిగి వచ్చాకనే ప్రమాణస్వీకారం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 48 చోట్ల బిజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి ఆతిశీ మాత్రం కాల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.