Kejriwal Response Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అనూహ్య విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ కంటే ఇంకో 12 సీట్లు ఎక్కువే సాధించి అద్భత విజయంతో ఢిల్లీలో 26 ఏళ్ల తరువాత కమల దళం తమ కాషాయ జెండా ఎగువేసింది. మరోవైపు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా తదితర పార్టీ నేతలు పరాజయం పొందడంతో, ఆప్ విధానాలను వ్యతిరేకించే వారు సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ అవుతోంది.
2023లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడిన ఈ వీడియోలో, “ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజేపీ అనేక కుట్రలు పన్నుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారు. ఏమి చేసినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేరని వారికి తెలుసు. ప్రధానమంత్రికి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను – ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ఆయన మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది” అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Modi ji: Haan to kya bola tha.. 😂 pic.twitter.com/82oRBWeXxX
— maithun (@Being_Humor) February 8, 2025
ఎన్నికల ఓటమి తర్వాత కేజ్రీవాల్ స్పందన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్పందించిన కేజ్రీవాల్, “ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాము. ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటాము” అని ప్రకటించారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామని, పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బిజేపీ అమలు చేయాలని కేజ్రీవాల్ కోరారు. గెలిచిన బిజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఈయనే.. మాజీ సిఎం కుమారుడికి పగ్గాలు?
కేజ్రీవాల్ మరోసారి తమ పార్టీ అధికారం కోసం కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆప్‌ను స్థాపించామని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజల అభివృద్ధి, హక్కుల కోసం పోరాడామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు ఉచిత విద్య, విద్యుత్, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు అందించిందని, ఇతర పార్టీలు ఇంతవరకు ఇలాంటి సౌకర్యాలు అందించలేదని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలపై సిఎం ఆతిశీ సింగ్ స్పందన
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సింగ్ (Atishi) ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, ఈ ఓటమి ఆప్‌కు ఎదురుదెబ్బ అని అన్నారు. కానీ తనపై నమ్మకంతో కాల్కాజీ ఓటర్లు తనను గెలిపించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, బిజేపీ చేస్తున్న అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆప్ ఓటమికి కారణాలు
ఆప్ నేతల పాలనా వైఫల్యాలు, కుంభకోణాలు, యమునా నది కాలుష్యం వంటి అంశాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ కారణాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అనేక సీనియర్ నేతలు ఓటమిని ఎదుర్కొన్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత బిజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.