Delhi crime: ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో ఒక భయంకరమైన దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారి, తోడుంటానని ప్రమాణం చేసిన భార్యను నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపాడు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ మనీష్ భాటి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అర్థరాత్రి వేళ దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ఆసుపత్రి సమీపంలో కాల్పులు.. అక్కడికక్కడే మృతి
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీష్ భాటి, ప్రియాంక దంపతులు అర్థరాత్రి గం. 2:00 ప్రాంతంలో బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరారు. తెల్లవారుజామున గం. 3:00 సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి (LBS) ఆసుపత్రి పరిసర ప్రాంతానికి చేరుకోగానే ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక బైక్ దిగి కోపంతో నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన మనీష్, తన వద్ద ఉన్న తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు దూసుకుపోవడంతో ప్రియాంక రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం నిందితుడు మనీష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
కట్నం వేధింపులే కారణమా?
మూడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మనీష్ గతంలోనూ అదనపు కట్నం కోసం ప్రియాంకను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత 2024లోనూ వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో, ప్రియాంక దాదాపు ఎనిమిది నెలల పాటు తన సోదరుడి ఇంట్లోనే ఆశ్రయం పొందింది. ఆ తర్వాత పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ భర్త వద్దకు వచ్చింది. కానీ, ఆమె జీవితంలో ఈ దారుణమైన ముగింపు ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే ఇంట్లో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
హంతక భర్త కోసం పోలీసుల వేట
భార్యను కాల్చి చంపిన అనంతరం ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మనీష్ భాటి కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు పోలీస్ విభాగంలోనే విధులు నిర్వహిస్తుండటంతో, అతను వాడిన ఆయుధం సర్వీస్ రివాల్వరా లేదా మరేదైనా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: నేపాల్‌లో రగులుతున్న మరో జెన్-జీ ఉద్యమం.. ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్.. ఎందుకంటే?