
Diwali Rush : దీపావళి సెలవుల రద్దీని సరిగా నిర్వహించడం లేదని భారతీయ రైల్వే విమర్శలు ఎదుర్కొంటుంది. లక్షలాది మంది తమ కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకోవడానికి ప్రయాణిస్తుండగా చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక చిక్కుకుపోయారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో నెటిజన్లు పంచుకుంటున్నారు.రద్దీగా ఉండే రైళ్లు, కంపార్ట్‌మెంట్ల వెలుపల పొడవైన క్యూలు.. వీటికి సంభిందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
భారతీయ రైల్వేలు నిర్వహణ చెత్తగా ఉంది. నా దీపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు. 3వ AC టిక్కెట్‌ను కలిగి ఉన్నా కూడా ఇలాంటి దుస్థితిని చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. పోలీసుల నుంచి ఎలాంటి సహాయం అందలేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు అని ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు అనుభవాలను పంచుకున్నాడు. రైలులో ఉన్న కార్మికుల గుంపు తనని రైలు నుంచి బయటకు విసిరేసారని.. డోర్‌లకు తాళం వేసి రైలులోకి ఎవరినీ అనుమతించలేదని వాపోయాడు. పోలీసులు తనకు సహాయం చేయడం లేదని స్పష్టంగా చెప్పారని..తన పరిస్థితిని చూసి నవ్వారని తెలిపాడు.
వడోదర డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) సోషల్ మీడియాలో సంఘటనపై స్పందించి.. రైల్వే పోలీసులు వెంటనే పరిశిలించాలని ఆదేశించారు.
దేశ రాజధానిలోని రైల్వే స్టేషన్లలో కూడా భారీ జనసందోహం కనిపించింది. న్యూఢిల్లీలోని స్టేషన్లలో ప్రయాణికులు తమ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సూరత్‌లో, బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు వైపు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో శనివారం తొక్కిసలాట జరిగింది, ఈ తొక్కిసలాటలో ఒకరు మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. పలువురు స్పృహతప్పి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు గుమిగూడడంతో.. ఇతర ప్రయాణీకులలో భయాందోళనలు సంభవించాయని పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న స్టేషన్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ 1,700 ప్రత్యేక రైళ్లను సర్వీసులోకి తెచ్చింది, 26 లక్షల అదనపు బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది.