
ICC World Cup 2023 : క్రికెట్ మ్యాచ్ ల్లో ఎప్పుడూ ఆటగాళ్ల రికార్డులు, వివిధ దేశాల జట్లు చేసిన రికార్డులే చూస్తుంటారు. కానీ ఇప్పుడు 2023 వరల్డ్ కప్ మెగా టోర్నీ కూడా ఒక రికార్డ్ సాధించింది. అదేమిటంటే ఇంతవరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లో స్టేడియానికి వచ్చి చూసిన వారి సంఖ్య పదిలక్షలకు పైనే ఉందని ఐసీసీ ఈవెంట్స్ అధిపతి క్రిస్ టెట్లీ చెప్పారు. ఇది ఒక రికార్డ్ అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఇప్పటికి వన్డేలకు ఆదరణ తగ్గలేదని రుజువైందని అన్నారు.
చాలామంది అనేమాట ఏమిటంటే స్టేడియంకి వచ్చి చూసేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని.. కానీ మెగా టోర్నీ ఆ మాటలు ఉత్తమాటలని నిరూపించింది. ఇంట్లో టీవీలకే పరిమితమవుతున్నారు, ఎవరికీ ఇంట్రస్ట్ లేదని చెప్పేవారందరికీ కనువిప్పు కలిగేలా మెగా టోర్నీ జరిగిందని అంటున్నారు. ప్రజలు ముఖ్యంగా యువత స్టేడియంకి వచ్చి చూడటాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు.
తమకు నచ్చిన ఆటగాళ్లు స్టేడియంలోకి తమ కళ్ల ముందు వెళుతూ ఉండటం మరువలేని అనుభూతి అని అంటున్నారు. అంతే కాదు వారు క్రీజులో ఎలా ఆడుతున్నారు? ఎలా సిక్స్ లు కొడుతున్నారు? ఇవన్నీ ప్రత్యక్షానుభూతిని పొందడం మాటలతో చెప్పేది కాదని అభిమానులు తన్మయత్వంతో అంటున్నారు. ఎంతఖర్చయినా పర్వాలేదు.. స్టేడియంకి వెళ్లి చూడాల్సిందేనని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.
ఇప్పుడు సినిమా థియేటర్ల పరిస్థితి అలాగే మారింది. థియేటర్లకి వెళ్లి చూస్తున్నవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోందని అంటున్నారు. కానీ కలెక్షన్లు చూస్తే వంద కోట్లు, వెయ్యి కోట్లు ఎలా వస్తున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో చూసేవాళ్లు చూస్తూనే ఉన్నారు. అంటే వాటికి ఆదరణ తగ్గలేదు. చూసే విధానమే మారిందని వివరణ ఇస్తున్నారు.
అయితే వన్డే క్రికెట్ కి ఇంకా ఆదరణ ఉండటం శుభపరిణామమని అంటున్నారు. స్టేడియంలో 10 లక్షల మంది చూస్తే హాట్ స్టార్ లో 4.4 కోట్లకు పైగా ప్రజలు వన్డే వరల్డ్ కప్ 2023 లైవ్ మ్యాచ్ లు చూస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది స్ట్రీమింగ్ రికార్డ్ గా చెబుతున్నారు.
ఆదివారమైతే ఈ లెక్క మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక సెమీఫైనల్ కి ఎంతమంది ఉంటారో ఊహించడం కష్టమని అంటున్నారు. ఇక ఇండియా ఫైనల్ కి వెళితే 10 కోట్లకు పైగా భారతీయులు ఆ రోజు మ్యాచ్ చూస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సెమీస్, ఫైనల్ మ్యాచ్ కి సంబంధంచి స్టేడియంలలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అయిపోయాయి.