Manish Sisodia : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా టార్గెట్ గా ఈడీ మరోసారి దాడులు చేపట్టింది. సిసోడియా పీఏ దేవేంద్రశర్మ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం దేవేంద్రశర్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు.
ఈడీ తనిఖీలపై సిసోడియా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు జరుపుతోందని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి తన ఇంట్లో సోదాలు చేపట్టారని మండిపడ్డారు. తన బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారని తెలిపారు. తన స్వగ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారని కానీ ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తన పీఏ నివాసంలో ఈడీ సోదాలు జరిపినా ఏమీ లభించకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శలు గుప్పించారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ శనివారం ఢిల్లీలో ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు. దేవేంద్ర శర్మను అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను ఈడీ అధికారులు ఖండించారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో దేవేంద్ర శర్మ వాంగ్మూలం నమోదు చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ అధికారులు సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టారు.