Watermelon : ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువగా లభిస్తుంది. వేసవి తాపం తగ్గించడంతో పాటు మన శరీరానికి ఉత్తేజం ఇస్తుంది. ఈ కాయలో 95 శాతం నీరే ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలు అమ్మేవారు ఇచ్చే కాయను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మోసపోతూ ఉంటారు.అసలు ఎలాంటి కాయలు కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుచ్చకాయలో ఆడ, మగ రకాలు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రని ఆకారంలో ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో కనిపిస్తాయి. ఇందులో నీటి శాతం, గుజ్జు కూడా ఎక్కువగా ఉంటుంది. తియ్యగా ఉండాలంటే మాత్రం ఆడ పుచ్చకాయను తీసుకోవాలి. సాధారణంగా పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత రుచిగా ఉంటుందని అనుకుంటారు. నిజానికి పుచ్చకాయ రుచికి, సైజుకు సంబంధం ఉండదు. బరువుగా ఉంటేనే కాయలో నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.అందుకే చిన్నగా ఉన్నా బరువు ఎక్కువ ఉన్న కాయలనే తీసుకోవాలి. అనేక మంది తాజాగా ఉన్నాయని పచ్చగా కనిపించే కాయలను కొంటారు. కానీ అవి పూర్తిగా పండవు, తియ్యగా కూడా ఉండవు. పూర్తిగా పండిన కాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అవే చాలా రుచిగా ఉంటాయి. కొన్నింటిపై ఒకవైపు తెలుపు, గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. అవి ఎంత ముదురు రంగులో ఉంటే కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చి గీతల్లా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ మచ్చలు తేనెటీగలు వాలడం వల్ల ఏర్పడతాయి. అంతేకాకుండా పుచ్చకాయ తొడిమ చూసి కూడా రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని అర్థం. పచ్చిగా ఉంటే ఇంకా ఆ కాయ పండలేదని తెలుసుకోవచ్చు. పుచ్చకాయను వేళ్లతో కొట్టడం వల్ల లోపల గుంత ఉన్నట్లు టక్‌మని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని అర్థం. శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందన్నమాట.