Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో మూడు రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో.. ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతిక కాయాన్ని గుర్తించారు. వారి కుటుంబసభ్యులతో డీఎన్‌ఏ తో.. ఘటనా స్థలంలో సేకరించిన ఆయన శరీర భాగాలు డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 11.10 గంటలకు డీఎన్‌ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి.
రూపానీ మృతదేహం గుర్తించిన అధికారులు.. ఆదివారం సాయంత్రానికి ఆయన కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. రాజ్‌కోట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గత మూడురోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం కొన్ని సెకన్‌లలోనే కుప్పకూలింది.
ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనలో 31మంది మృతుల DNAలు.. వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ లతో సరిపోయినట్లు తేలింది. ఈ ప్రమాదంలో దుర్మరణానికి గురయిన 274 మందిలో చాలా మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. DNA పరీక్షతో సంబంధం లేకుండా 8 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మిగతా మృతుల డీఎన్‌ఏ లను గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు.
డీఎన్‌ఏ ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, తొందరపాటుగా చేయకూడదన్నారు ప్రొఫెసర్ డాక్టర్ రజనీశ్ పటేల్. చట్టపరమైన, వైద్యపరమైన చిక్కులున్నాయన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి అయిన విశ్వాస్‌కుమార్ రమేష్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అలాగే ప్రమాదంలో మరణించిన 11మంది విదేశీయుల కుటుంబాల సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఎయిర్ ఇండియా బోయింగ్.. ఇంత దరిద్రమా.. ఐదేళ్ల కిందటే ప్రయాణికుడి రివ్యూ
ఎయిర్ ఇండియా ఏఐ 171 దుర్ఘటనతో ఆ ఫ్లైట్ నెంబర్‌ను శాశ్వతంగా నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 స్థానంలో ఏఐ 159 కొత్త ఫ్లైట్ నెంబర్‌తో నడపనున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం 274 మంది మృతిచెందారు.