Air India 787 Review| గుజరాత్ అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. 270 మందికి పైగా మరణించారు. దీంతో ఆ విమానంలో లోపాల గురించి, ఆ ప్రమాదం ఎలా జరిగిందనే చర్చ ఇప్పుడు సర్వత్రా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలు, దాని లోపాలతో కూడిన ఒక రివ్యూ అయిదేళ్ల క్రితం ఒక యూట్యూబర్ చేశాడు. ఆ యూట్యూబర్ తన యూట్యూబ్ వీడియో ఛానెల్ లో చేసిన రివ్యూలో విమానంలో సర్వీస, దాని లోపాల గురించి ఇలా వివరించాడు.
జోష్ కాహిల్ అనే ట్రావెల్ వ్లాగర్ 2020 జనవరి 22న యూట్యూబ్‌లో “ఎయిర్ ఇండియా 787 ఎకానమీ క్లాస్” గురించి రివ్యూ చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. ఈ 11 నిమిషాల వీడియోలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి బోయింగ్ 787-8 విమానంలో ప్రయాణ అనుభవాన్ని వివరించాడు. ఎయిర్ ఇండియా సేవలు, సౌకర్యాలు, సమస్యలను గురించి చర్చించాడు. అప్పట్లో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఇండియా సవాళ్లను కూడా విశ్లేషించాడు.
ఈ వీడియో ప్రారంభంలో కాహిల్.. ఎయిర్ ఇండియా సేవల గురించి సందేహం వ్యక్తం చేశాడు. బోయింగ్ 787-8 ఒక కొత్త విమానం కావడంతో అనుభవం మెరుగ్గా ఉంటుందేమోనని ఆశించాడు. రాత్రి ఏడు గంటలకు చెక్ ఇన్ చేసి.. (AI120) ప్రయాణం ప్రారంభించి ఢిల్లీ చేరే వరకు తన ప్రయాణంలో అన్నీ వివరించాడు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో చెక్-ఇన్ సులభంగా జరిగినప్పటికీ.. ఎకానమీ ప్రయాణికులకు క్యూలు ఎక్కువగా ఉన్నాయి. బోర్డింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. బిజినెస్ క్లాస్, కుటుంబాలకు ప్రాధాన్యం లేకపోవడంతో గేట్ వద్ద గందరగోళం ఏర్పడింది.
విమానంలోని ఎకానమీ క్యాబిన్‌లో మొత్తం 238 సీట్లు 3-3-3 విధానంలో ఉన్నాయి. సీట్ల మధ్య 33 ఇంచ్‌ల ఖాళీ, 17 ఇంచ్‌ల వెడల్పు గ్యాప్ ఉంది. సీట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి, పెద్ద కిటికీలు, నిశ్శబ్ద వాతావరణం వంటి డ్రీమ్‌లైనర్ లక్షణాలు ఆకట్టుకున్నాయి. కానీ, క్యాబిన్ స్థితి దారుణంగా ఉంది. సీట్లు మురికిగా, దెబ్బతిని, నిర్వహణ లోపంగా ఉన్నాయి.
ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ (Inflight Entertainment – IFE) వ్యవస్థ ఏ మాత్రం బాగోలేదని, స్క్రీన్ పనిచేయలేదు, ఇతరుల స్క్రీన్‌లు కూడా దెబ్బతిన్నామని కాహిల్ చూపించాడు. హెడ్‌ఫోన్‌ల నాణ్యత తక్కువగా ఉంది, సినిమాల ఎంపిక కూడా పరిమితంగా ఉంది. భోజనం కూడా సరిగా లేదు. చికెన్ కర్రీ, రైస్, పాత క్రోసెంట్‌లు చల్లగా, రుచిలేకుండా ఉన్నాయి. భారతీయ వంటకాలు రుచికరంగా ఉంటాయని ఆశించిన కాహిల్ నిరాశ చెందాడు. సిబ్బంది మర్యాదగా వ్యవహరించినప్పటికీ.. వారు సర్వీస్ ఇవ్వడంలో అనాసక్తి చూపారు. దుప్పటి ఇచ్చినా, దిండు లేదు, వై-ఫై సౌకర్యం కూడా లేదు.
2020లో ఎయిర్ ఇండియా ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ యాజమాన్యం వల్ల నిర్వహణ, సేవలు మెరుగుపడలేదని కాహిల్ చెప్పాడు. డ్రీమ్‌లైనర్ ఆధునిక విమానం అయినప్పటికీ.. నిర్వహణ లోపం వల్ల సౌకర్యాలు సరిగా ఉపయోగపడలేదు. ఢిల్లీకి సమయానికి చేరినప్పటికీ, ఫ్లైట్ లో ఎంటర్ టైన్మెంట్, ఆహారం, సేవలు నిరాశపరిచాయి. ఒక టికెట్ ధర $300.. కాస్త తక్కువగా ఉండటం ఒక్కటే ప్లస్ పాయింట్, కానీ అది సరిపోదని కాహిల్ అన్నాడు.
కొన్ని మంచి అంశాలు కూడా ఉన్నాయి. సీట్ల సౌకర్యం, నిశ్శబ్ద క్యాబిన్, సమయపాలన బాగున్నాయి. అయితే ఎయిర్ ఇండియా కొన్ని తక్కువ ధర విమానాల కంటే మెరుగని కాహిల్ చెప్పాడు. అదే సమయంలో మిగతా తక్కువ ధర ఎయిర్ లైన్స్ అయిన జెట్ ఎయిర్‌వేస్, స్టార్ అలయన్స్ విమానాలతో పోలిస్తే వెనుకబడింది. 2016 సంవత్సరంలో ట్విట్టర్ ఎక్స్‌లో.. సీట్‌గురు రివ్యూలలో ప్రయాణికులు సీట్ల సౌకర్యాన్ని మెచ్చుకున్నా, మురికి క్యాబిన్, సిబ్బంది నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.
Also Read: చెట్టు కింద నిద్రిస్తున్న బిడ్డపై పడ్డ విమానం.. తప్పించుకున్న తల్లి, గుండె బరువెక్కించే ఘటన
మొత్తంగా.. ఎయిర్ ఇండియా 787 ఎకానమీ క్లాస్ సమస్యలతో నిండి ఉందని కాహిల్ చెప్పాడు. ఆధునిక విమానం ఉన్నప్పటికీ, నిర్వహణ, సేవల లోపాలు సరిగా లేకపోవడం గమనార్హం. 2025 నాటికి 12 లక్షల వ్యూస్‌తో ఈ వీడియో ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. తక్కువ ధర కోసం ప్రయత్నించవచ్చని, కానీ మెరుగైన సేవలు అవసరమని కాహిల్ సూచించాడు.
ఎయిర్ ఇండియా 787-8 విమానాలను నిలిపివేసే ఆలోచనలో భారత ప్రభుత్వం
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలో కూలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే బతికారు. విమానం డాక్టర్ల క్వార్టర్స్‌పై పడి మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్‌లో లోపం లేదా పక్షి ఢీకొట్టడం కారణమై ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. భారత ప్రభుత్వం ఈ విమానాలను నిలిపివేసి సురక్షిత సమీక్ష చేయాలని ఆలోచిస్తోంది. ఎయిర్ ఇండియా నిర్వహణపై కూడా పరిశీలన జరగనుంది. బోయింగ్, జీఈ సంస్థలు దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పాయి. కేంద్రం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.