Tamilnadu: కారణాలు ఏమైనా కావచ్చు.. ఆ ఇంట్లో ఐదుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో చిన్నారులు ఉండడంతో కంట తడి పెట్టించింది. సంచలనం రేపిన ఈ ఘటన తమిళనాడులో బయటపడింది. ఈ ఘటన వెనుక అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..
తమిళనాడులోని కరూర్ జిల్లా చిన్న కాళిపాళయంలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దవాళ్లు, ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా మారారు. రామసామి-జానకి దంపతులు కాళిపాళయంలో నివాసం ఉంటున్నారు. వీరికి కన్నన్, కుమార్తె సుకున ఉన్నారు.
కన్నన్ తన కుటుంబంతో కరూర్‌లోని వెంగమేడులో నివాసం ఉంటున్నాడు. సుకున తన భర్త ప్రభుతో కలిసి వేలాయుతం పాళయంలో నివాసం ఉంటోంది. వీరికి కుమార్తె శివాని, కొడుకు అతిరన్ ఉన్నారు. దీపావళికి సుకున తన పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త ప్రభు అత్తింటికి రాలేదు. దీపావళి వేడుకలు తర్వాత సుకున పిల్లలతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు భర్త ప్రభు గొడవకు దిగాడని సమాచారం.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుకున మంగళవారం తన పిల్లలు శివాని, అతిరన్‌లతో తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. భర్తతో తలెత్తిన వివాదాన్ని తల్లిదండ్రులకు వివరించింది. సుకున కుటుంబ జీవితం పట్ల రామస్వామి దంపతులు అప్పటికే విసుగు చెందారు. బుధవారం సాయంత్రం తమ ఇంటి పక్కనే ఉన్న నీటి బావిలో రామస్వామి, జానకి, సుకున, శివాని, అతిరన్ దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ALSO READ: డ్రగ్స్ మహమ్మారిపై ప్రధాని భావోద్వేగం.. యువత భవిష్యత్తుపై ఆవేదన.. నక్సలిజం తరహాలో అంతానికి పిలుపు!
బావిలో మృతదేహాలు కనిపించడంతో ఇరుగుపొరుగు వారు వంగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఫ్యామిలీ అంతా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.