New Lift Rules 2026: లిఫ్టులు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్ వేల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నివాస సముదాయాలు, వాణిజ్య భవనాల్లో వాటి వాడకంపై తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘మహారాష్ట్ర లిఫ్ట్, ఎస్కలేటర్ అండ్ మూవింగ్ వాక్‌వే రూల్స్ – 2026’ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి నవంబర్ 1వ తేదీ నుంచే ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముంబయి, పుణె, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని భవనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని మహరాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కొత్తగా తీసుకొచ్చిన లిఫ్ట్ నిబంధనల్లో పిల్లల భద్రకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 12 ఏళ్లలోపు వయసున్న పిల్లలు తల్లిదండ్రులు లేదా పెద్దల తోడు లేకుండా ఒంటరిగా లిఫ్టులు, ఎస్కలేటర్లను వినియోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. లిఫ్టుల వద్ద పిల్లలకు జరిగే ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా భవనాల్లో లిఫ్ట్ ఆపరేటర్లుగా 18 ఏళ్లలోపు వారిని నియమించకూడదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
లిఫ్టులు, ఎస్కలేటర్ల నిర్వహణ విషయంలో బిల్డింగ్ మేనేజ్‌మెంట్లపై ప్రభుత్వం పూర్తి బాధ్యతను ఉంచింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్‌కు కనీసం నెలకు ఒకసారి భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి ఆ నివేదికను ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి లిఫ్ట్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పనిసరి చేశారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలను గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగించాలని కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేసే ముందు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
నివాస సముదాయాల్లోని లిఫ్టుల భద్రతకు సంబంధించి హౌసింగ్ సొసైటీలు, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కమిటీలను జవాబుదారీగా ప్రభుత్వం మార్చింది. చెకింగ్ నివేదికల రికార్డులను సొసైటీలు భద్రపరచాలని సూచించింది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా లిఫ్ట్ ప్రమాదం జరిగితే ఆ విషయాన్ని 24 గంటల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిబంధనను కూడా ఇందులో చేర్చారు.
Also Read: పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?
ప్రతి లిఫ్ట్‌లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు, నెలవారీ భద్రతా తనిఖీలు, వార్షిక ఆడిట్ నిర్వహణ తప్పనిసరి. 12 ఏళ్లలోపు పిల్లలు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కకూడదు. 18 ఏళ్లలోపు వారిని ఆపరేటర్లుగా నియమించకూడదు. ప్రమాదం జరిగితే 24 గంటల్లోగా అధికారులకు సమాచారం అందించడంతో పాటు లిఫ్ట్ మెయింటెనెన్స్ రికార్డులను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత బిల్డింగ్ మేనేజ్‌మెంట్లపైనే ప్రభుత్వం ఉంచింది. ఈ నిబంధనల ద్వారా రాష్ట్రంలోని అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ఈ రైతు ‘లాటరీ’ పండిందోచ్.. రూ.500 టికెట్‌పై ఏకంగా రూ.12 కోట్ల జాక్ పాట్.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!