Karnataka Accident: కర్ణాటకలోని మాగడి తాలూకాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టించింది. బెంగళూరు నుంచి కుణిగల్ వైపు వెళ్తున్న ఒక కారు, మార్గమధ్యంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు యువతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కాలేజీ విద్యార్థినులు గానవి , వైష్ణవిగా గుర్తించారు.
యాక్టివిటీ క్లాస్‌కు వెళ్తుండగా విషాదం
ప్రమాదానికి గురైన కారులో మొత్తం ఆరుగురు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒక యాక్టివిటీ క్లాస్‌కు హాజరయ్యేందుకు ఉత్సాహంగా బయలుదేరారు. కానీ, విధి మరోలా తలచింది. గుడెమారనహళ్లి హ్యాండ్‌పోస్ట్ సమీపానికి రాగానే.. ఒక్కసారిగా కారు అదుపుతప్పడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. క్షణాల వ్యవధిలోనే ఆనందంగా వెళ్లాల్సిన ప్రయాణం విషాదంగా మారింది.
విషమంగా క్షతగాత్రుల పరిస్థితి
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను వెంటనే స్థానికుల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మిగతా ఇద్దరు విద్యార్థులకు నెలమంగల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
ఈ దుర్ఘటనకు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం లేదా కారు అతివేగంగా ఉండటమే ప్రధాన కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెలమంగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల రూపంలో నిత్యం నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: లోకేష్‌కు బిజినెస్ సమ్మిట్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా?: పేర్ని నాని