Bangladesh Aid: భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. భారత దేశంపై ఉన్న కోపంతో మైనారిటీలైనా హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఏటా విదేశీ సాయం కింద కేటాయించే బడ్జెట్ కేటాయింపుల్లో బంగ్లాదేశ్ వాటాను కేంద్రం గణనీయంగా తగ్గించింది. గతేడాది రూ.120 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపును ఈసారి సగానికి తగ్గించింది.
విదేశీ మంత్రిత్వశాఖ పరిధిలో విదేశీ సహాయం (Aid to Countries) కేటాయింపుల్లో భాగంగా పలు సరిహద్దు దేశాలకు రూ. 5,685.56 కోట్లు కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు. ఇందులో అత్యధికంగా భూటాన్ కు రూ.2,288 కోట్లు నిర్దేశించారు. అఫ్గనిస్తాన్ కు రూ.150 కోట్లు ప్రకటించారు. అయితే బంగ్లాదేశ్ తో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలను పరిగణలోకి తీసుకొని ఆ దేశానికి కేటాయింపులను రూ.60 కోట్లకు పరిమితం చేశారు. షేక్ హసీనా తర్వాత బంగ్లాదేశ్ లో ఏర్పడ్డ ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) పాక్ తో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తుండటంతో కేంద్రం ఈ మేరకు విదేశీ సాయం కింద కేటాయించే నిధుల్లో 50 శాతం మేర కోత విధించినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి అక్కడి మూకలు.. మైనారిటీలైన హిందువులపై హింసకు తెగబడుతున్నాయి. వారి ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ప్రార్థనా స్థలాలపై కూడా దాడులు చేస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ ఇటీవల పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే దీనిపై విదేశాంగ మంత్రిత్వశాఖ.. గురువారం రాజ్యసభలో స్పందిచింది. బంగ్లాదేశ్ లో మైనారిటీల పట్ల జరుగుతున్న అరాచకాలను, వారి భద్రత విషయంలో తమకున్న ఆందోళనను ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు విదేశాంగ సహాయక మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు.
అమెరికా – ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. గతేడాది సెప్టెంబర్ లో ఇరాన్ పై అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. చాబహార్ ఓడరేవును నిర్మిస్తున్న భారత్ కు 6 నెలల పాటు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ గడువు ఏప్రిల్ 26తో ముగియనుండటం గమనార్హం. మరోవైపు భారత్ నుంచి అత్యధికంగా విదేశీ సాయం పొందుతున్న దేశంగా భూటాన్ ఉంది. గతేడాది భూటాన్ కు రూ. 2,150 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.2,289 కోట్లు బడ్జెట్ లో అందించడం గమనార్హం.
Also Read: Budget 2026 Auto Updates: చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!