Nityananda Swami: దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో స్వామి నిత్యానంద ఒకరు. కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు. చివరకు ఆయన జాడ తెలిసింది. మద్రాస్ హైకోర్టుకి నిత్యా శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించింది. దీంతో స్వామిని తీసుకొస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నాడు స్వామి నిత్యానంద . కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. బతికుండగనే కైలాసంలో నివాసం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ కైలాష్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. కొందరేమో అమెరికా-జపాన్ మధ్య అని చెబుతారు. ఇంకొందరు థాయ్‌లాండ్ సమీపంలోని ఓ దీవిలో ఉన్నట్లు చెబుతున్నారు.
కానీ కైలాష్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు. చివరకు నిత్యానందస్వామి ఆచూకీ బయటపడింది. ఆస్ట్రేలియా సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనానికి తెలియజేసింది. నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగుపెడతాడు? అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది.
ఇంతకీ నిత్యానంద వస్తాడా? అక్కడే నుంచి అంతా నడపిస్తున్నాడా? అనేదానిపై చర్చ మొదలైంది. మదురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ: తొక్కిసలాట జరిగితే కఠిన శిక్షలు
పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరైంది. నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు. ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు.
కొన్నాళ్లు కిందట నిత్యానంద ఆచూకీపై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. కైలాస దేశం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ ఉండాలా? అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆధీనం మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే.. కైలాష్ దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన హార్డ్‌కోర్ భక్తులు.