Karnataka Crowd Bill| కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఐపిఎల్ విజయ యాత్రలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరంగా మారింది. ఈ సంఘటనలో 11 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, ప్రభుత్వం “కర్ణాటక జనసమూహ నియంత్రణ బిల్లు 2025” (Crowd control law(CCL)) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
బహిరంగ సమావేశాలు, రాజకీయ ర్యాలీలు, స్పాన్సర్డ్ కార్యక్రమాలను నియంత్రించడానికి ఈ కొత్త చట్టం రూపొందించబడింది. అయితే, జాతరలు, రథోత్సవాలు, మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల వంటి సాంప్రదాయ, మతపరమైన కార్యక్రమాలకు ఈ చట్టం నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఈ బిల్లుపై జూన్ 19, 2025న కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఇక తదుపరి సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఈ చట్టం ప్రకారం.. పోలీసుల ఆదేశాలను పాటించని లేదా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఈవెంట్ నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోకపోతే, జనసమూహాన్ని నియంత్రించలేకపోతే, లేదా ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, వారు బాధ్యత వహించాలి. ఒకవేళ తొక్కిసలాట వల్ల ఎవరైనా గాయపడితే లేదా మరణిస్తే, నిర్వాహకులు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే, ప్రభుత్వం దానిని వసూలు చేసే అధికారం కలిగి ఉంటుంది.
ఈ చట్టం కింద నేరాలు.. నాన్-కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్‌గా పరిగణించబడతాయి. ఫస్ట్-క్లాస్ మేజిస్ట్రేట్ చేత ఈ నేరాల విచారణ సాగుతుంది. ఈవెంట్ నిర్వాహకులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే, వారికి కఠిన శిక్షలు తప్పవు. ఉదాహరణకు, అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం లేదా జనసమూహాన్ని నియంత్రించలేకపోవడం వంటివి శిక్షార్హ నేరాలుగా లెక్కించబడతాయి.
Also Read: ఉద్యోగంలో చేరకుండానే లక్షల్లో నష్టపరిహారం.. ఉద్యోగి హక్కులని చెప్పిన కోర్టు
ఈ తొక్కిసలాట ఘటన తర్వాత.. ప్రభుత్వం బెంగళూరులోని కొందరు ఉన్నత పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అలాగే, ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్‌తో సహా, ఈవెంట్ నిర్వాహక సంస్థతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేసింది. ఈ కొత్త చట్టం ద్వారా కర్ణాటక ప్రభుత్వం బహిరంగ సమావేశాలను మెరుగ్గా నిర్వహించడం, జనసమూహ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలను నివారించాలని భావిస్తోంది.