India’s foreign exchange reserves : డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ దారుణంగా పతనమవుతుండటంతో… భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా అదేస్థాయిలో కరిగిపోతున్నాయి. అక్టోబరు 14తో ముగిసిన వారానికి భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. RBI డేటా ప్రకారం, భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.5 బిలియన్ డాలర్లు పడిపోయి 528.367 బిలియన్ డాలర్లకు చేరాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో ఏకంగా వంద బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. అయితే, విదేశాల నుంచి దిగుమతులు కూడా గరిష్టస్థాయికి చేరడంతో… విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 114 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కారణంగా భారత్ లాంటి వర్ధమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులన్నీ తరలివెళ్లిపోతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు సున్నా స్థాయిలో ఉన్నప్పుడు… అక్కడి నుంచి పెట్టుబడులన్నీ డాలర్ల రూపంలో భారత్ సహా చాలా దేశాల్ని ముంచెత్తాయి. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ వస్తున్నందున… ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తరలించుకు పోతున్నారు. అందుకే డాలర్ తో మారకం విలువలో చాలా దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్నాయి. మన రూపాయి పైనా ఆ ఎఫెక్ట్ పడింది. ఏడాది వ్యవధిలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 శాతం క్షీణించింది. ఈ ఏడాది జనవరిలో డాలర్ తో పోలిస్తే 73గా ఉన్న రూపాయి మారకం విలువ… ఇప్పుడు 83 రూపాయలకు పడిపోయింది. రూపాయి విలువను కాపాడేందుకు రంగంలోకి దిగిన RBI… డాలర్లను విక్రయిస్తూ వస్తున్నందున… భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ వస్తున్నాయి. అవి మరింత పతనం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.