
Iran’s Drone: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా ఇరాన్ డ్రోన్ టెక్నాలజీ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. షాహెద్ 136 మోడల్ కామికేజ్ డ్రోన్లను రష్యాకు సరఫరా చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ దేశాల ఆంక్షలు విధించినా.. ఇరాన్ డ్రోన్ ప్రోగ్రాం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్.. IRGC గత నెలలో దీర్ఘ శ్రేణి డ్రోన్ మొహాజెర్-10 ను లాంచ్ చేసింది.
ఆ డ్రోన్ 24 గంటల పాటు నిర్విరామంగా ఎగరగలదు. 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థం ఉంది. ప్రపంచంలో ఇంత సుదూరం వెళ్లగలిగే తొలి డ్రోన్ ఇదే. 300 కిలోల పేలోడ్‌ను మోయగలదు. రష్యాకు ఇరాన్ సరఫరా చేసిన మొహాజెర్-6 డ్రోన్ సామర్థ్యానికి ఇది రెట్టింపు. ఉక్రెయిన్‌పై రష్యా విజయవంతంగా ప్రయోగించింది మొహాజెర్-6 డ్రోన్లనే.
లాంగెస్ట్ రేంజ్ డ్రోన్‌తోనే ఇరాన్ సరిపెట్టుకోలేదు. దానిని ఆవిష్కరించిన రెండు రోజులకే మరో విభిన్నమైన డ్రోన్‌ను తీసుకొస్తున్నట్టు IRGC ప్రకటించింది. మిస్సైళ్లు, బాంబులను మోసుకెళ్లగల వాటర్ లాండింగ్ నేవల్ డ్రోన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. నేల నుంచే కాకుండా నీటి నుంచి కూడా ప్రయోగించగల డ్రోన్లను తమ బలగాలు తయారు చేస్తున్నాయని IRGC నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ అలీ రేజా తంగ్సిరి వెల్లడించారు.
నీటిపై కూడా లాండ్ కాగలిగిన అన్‌మ్యాన్డ్ ఎయిర్ వెహికల్..యూఏవీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని ఆయన చెప్పారు. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్-పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, ఆగ్జలరీ షిప్స్‌లో యూఏవీల శ్రేణిని మోహరించగల సాంకేతిక సామర్థ్యాన్ని ఇరాన్ ఇటీవల గణనీయంగా పెంచుకుంటోంది. నిరుడు జూలైలో తొలిసారిగా డ్రోన్ క్యారీయర్‌ను ఇరాన్ ఆరంభించింది.