
Gaza Hospital Blast : గాజా స్ట్రిప్‌పై హమాస్ పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐడీఎఫ్ బలగాలకు ఎక్కడా ప్రతిఘటన ఎదురుకాకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. టెర్రిస్టులు దక్షిణ గాజాను పరారవుతుండగా.. హమాస్ స్థావరాలను పౌరులు లూటీ చేస్తున్నారని సైనికాధికారులు తెలిపారు. గాజా సిటీలోని హమాస్ పార్లమెంట్ భవనం సైనికుల హస్తగతమైంది. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన ఆరుగురు సీనియర్ కమాండర్లు మరణించారు.
గాజాలోని ఆస్పత్రులను హమాస్ మిలిటెంట్లు తమ అడ్డాలుగా, మానవ కవచాలుగా మార్చుకున్నారు.. అక్కడ నుంచే సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు… ఇజ్రాయెల్ ఇంతకాలం వాదిస్తున్నది ఇదే. ఇప్పుడు దీనికి సంబంధించి ఆధారాలను సైతం ఇజ్రాయెల్ బలగాలు బయటపెట్టాయి. గాజాలోని రంతిసి పిల్లల ఆస్పత్రిని తమ కమాండ్ సెంటర్‌గా వినియోగించిన వైనాన్ని, ఆస్పత్రి బేస్‌మెంట్‌లో బందీలను ఉంచిన తీరును ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగారీ వివరించారు.
మహిళ దుస్తులు, డయాపర్లు, బేబీ బాటిల్‌తో పాటు బందీలను కట్టేయడానికి వినియోగించిన తాడు ఓ గదిలో ఉన్నాయి. బందీల కోసం బాత్ రూం, వంటగది తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కమాండ్-అండ్-కమాండ్ కంట్రోల్‌గా మిలిటెంట్లు ఆ ఆస్పత్రిని వినియోగించుకున్నారని హగారీ ఆరోపించారు. ఆ ఆస్పత్రి దిగువనే ఉన్న సొరంగంలోకి దారి తీసే ప్రవేశమార్గాన్ని కూడా సైనికులు కనుగొన్నారు.
కేన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన రంతిసి ఆస్పత్రి పరిసరాల్లోనే బందీలు ఉండి ఉంటారని బలగాలు అనుమానిస్తున్నాయి. కొందరు రోగులను తీసుకుని మిలిటెంట్లు ఆ ఆస్పత్రిని ఖాళీ చేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. యుద్ధ సమయాల్లో ఆస్పత్రులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని అంతర్జాతీయ చట్టాలు నిర్దేశిస్తున్నాయి.
దీనిని అడ్డం పెట్టుకుని మిలిటెంట్లు రంతిసి ఆస్పత్రి బేస్‌మెంట్‌లో ఆయుధాలను దాచారు. ఇంధనం నిండుకోవడంతో అల్-ఖుద్స్ ఆస్పత్రిని మూసేశారు. అక్కడున్న 6 వేల మంది రోగులను రెడ్‌క్రాస్ సభ్యులు తరలించారు. ఆ ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్న 21 మంది టెర్రరిస్టులను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి.
.
.