Jaishanker Sindhu Water| భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధం నిలిచిపోయి తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం సింధూ నది జలాలను భారత్ విడుదల చేయకపోతే కాల్పుల విరమణ కొనసాగదని.. తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సింధూ నదీ జలాలు పాకిస్తాన్ కు సరఫరా విషయంలో ఒక స్పష్టతనిచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వరకు.. ఉగ్రవాదులను ఆ దేశం నుంచి బయటకు పంపే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ అమలు చేయదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చించడానికి ఇక ఒకే ఒక అంశం మాత్రమే మిగిలి ఉందని, అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయం మాత్రమేనని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపైనే చర్చలు జరుగుతాయని, ఈ విషయంలో చర్చలకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ.. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించామని, ఆపరేషన్ ప్రారంభంలోనే పాకిస్తాన్‌కు సందేశం పంపినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యంపై ఎక్కడా దాడులు జరపలేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత విడుదలైన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే, భారత్ ఎంత నష్టం కలిగించిందో స్పష్టమవుతుందని జైశంకర్ అన్నారు. మే 7న దాడులు ప్రారంభమైనప్పుడు, వాటిని అడ్డుకోవడానికి ధైర్యం చేయని వ్యక్తులే కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని వెల్లడించారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం చేయడాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.
అలాగే.. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చర్చలు కొంత క్లిష్టమైనవని, అవి పూర్తయ్యే వరకు దీనిపై ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: హనీట్రాప్‌లో పాక్ దౌత్యాధికారి.. బంగ్లాదేశీ యువతితో అశ్లీల వీడియోలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన “జీరో టారిఫ్” వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, అవి క్లిష్టమైనవని, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఒప్పందం కుదిరే వరకు ఏ ప్రకటన చేయడం సమయోచితం కాదన్నారు.
కశ్మీర్ విషయంలో మూడోపక్ష జోక్యాన్ని భారత్ ఎప్పటికీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. ట్రంప్ కశ్మీర్, కాల్పుల విరమణలపై వ్యాఖ్యలు చేయడం, పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం కోరారు.