Pakistan High Commissioner Honey Trap| ఓ పాకిస్తాన్ దౌత్యాధికారి హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ తరఫున హైకమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ అనే వ్యక్తి ఓ బంగ్లాదేశీ యువతితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాకుండా, ఆ యువతితో ఆయన తీసుకున్న అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగశాఖ అప్రమత్తమై.. మరూఫ్ పై చర్యలు తీసుకుంది. ఆయనను సెలవుపై పంపించిందని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి.
అయితే, అధికార వర్గాలు మాత్రం మరూఫ్ సెలవులో ఉన్నారని మాత్రమే స్పష్టం చేశాయి. ఆయన ఎంతకాలం సెలవులో ఉంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పటివరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా, ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలిక హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇదే సమయంలో మరూఫ్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఆయన ఓ బంగ్లాదేశీ యువతితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు ఆధారంగానే ఆయన ఆ యువతితో ప్రేమలో పడ్డారని భావిస్తున్నారు. అంతేకాకుండా, పాకిస్తాన్‌కు చెందిన ఈ దౌత్యవేత్త ఆ యువతితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని.. ఆ యువతి ఆయనను హనీ ట్రాప్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆమె బ్లాక్ మెయిల్ చేయడం కారణంగానే ఆయన నిఘా సంబంధిత రహస్య సమాచారాన్ని ఆ యువతితో పంచుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్ కు చెందిన మీడియా సంస్థ బంగ్లాదేశీ డైలీ ప్రొథోమ్ ఆలో.. ఈ కథనాలను ప్రసారం చేసింది. మే 11, 2025న మారూఫ్ ఢాకా వదిలి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ వెళ్లిపోయారని.. ఇక ఆయనను సస్పెండ్ చేశారని సమాచారం. ఆయనను అనూహ్యంగా హై కమిషనర్ పదవి నుంచి తొలగించడం వెనుక ఈ హనీ ట్రాప్ స్కాండల్ కారణమని బంగ్లా మీడియా కథనం ద్వారా తెలుస్తోంది.
Also Read: సింధు జలాలపై ఆంక్షలు కొనసాగితే కాల్పుల విరమణ కొనసాగదు.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఇక మరోవైపు, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఒక అధికారి.. గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత్ నుండి బహిష్కరించబడ్డారు. భారత ప్రభుత్వం ఆయనను “పర్సన్ నాన్ గ్రేటా” (అవాంఛిత వ్యక్తి)గా ప్రకటించి, 24 గంటల వ్యవధిలో దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ దౌత్య నియమాల ప్రకారం.. ఒక వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, అతడిని అవాంఛిత వ్యక్తిగా ప్రకటించి, దేశం నుంచి బహిష్కరిస్తారు. ఆ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.