Japan Earthquake: జపాన్ లో మరోమారు శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదు అయ్యాయి. ఉత్తర జపాన్ తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో భూమికి సుమారు 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాకాసి అలలు తీర ప్రాంతాన్ని ముచ్చెంతే ప్రమాదముందని వార్నింగ్ బెల్స్ మోగించింది.
భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ఇవాటే (Iwate) ప్రిఫెక్చర్, హొక్కైడో (Hokkaido) తీర ప్రాంతాలలో సుమారు 3 మీటర్ల (దాదాపు 10 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలు, సురక్షిత భవనాలపైకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అలలు భారీ ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున.. మరో ప్రకటన వచ్చేవరకూ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
కాగా, జపాన్ లోని అమోరి (Aomori), హచినోహే (Hachinohe) వంటి నగరాల్లో భూకంప తీవ్రత భారీగా ఉన్నట్లు సమాచారం. ప్రజలు సరిగా నిలబడలేని స్థాయిలో భూమి కంపించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు భూకంపనలు వచ్చిన ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాలు ఉండటంతో స్థానిక ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మెుదలయ్యాయి. అయితే అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు సంభవించలేదని అధికారులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే జపాన్ లో 7.4 తీవ్రతో భూకంపం సంభవించిన నేపథ్యంలో భారత్ లోనూ ఒక్కసారిగా ఆందోళనలు మెుదలయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు భారత్ కు ఏమైనా సునామీ ముప్పు ఉంటుందేమో అన్న భయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి భయాల్లో ఎలాంటి లాజిక్ లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ భూకంపం పసిఫిక్ మహా సముద్రం తీరంలో సంభవించింది. భారత్ మాత్రం హిందూ మహాసముద్ర తీరంలో ఉంది. కాబట్టి పసిఫిక్ మహా సముద్రంలో వచ్చే సునామీ అలలు.. భౌగోళికంగా హిందూ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం లేదు.
Also Read: శాంసంగ్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. కుర్రకారుకు పండుగే.. ఫొటోలు, వీడియోలు మీ ఇష్టం!
హైదరాబాద్‌లోని ‘ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్’ (ITEWC – INCOIS) సాధారణంగా ఇటువంటి సమయాల్లో డేటాను విశ్లేషించి హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ఒకవేళ సునామీ భయాలే ఉండి ఉంటే ఆ సంస్థ ఇప్పటికే వార్నింగ్ బెల్స్ మోగించి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా పసిఫిక్ ప్రాంతంలో వచ్చే భూకంపాలు భారత తీరానికి (తూర్పు, పశ్చిమ తీరాలు) ముప్పు కలిగించవని గతంలోనూ పలుమార్లు ఆ సంస్థ స్పష్టం చేయడం గమనార్హం. కాబట్టి ప్రస్తుత సునామీ హెచ్చరికలు కేవలం జపాన్ తీర ప్రాంతాలకు ముఖ్యంగా ఇవాటే (Iwate), హొక్కైడో (Hokkaido) ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉందని నిపుణులు వివరిస్తున్నారు.
Also Read: రాజస్థాన్ రాయల్స్ జట్టులో ముసలం…వైభవ్ సూర్యవంశీ కన్నీళ్లు, చేసిందంతా వాడే !