
Gali Janardhanreddy Joined BJP: రాజకీయాల్లో నేతలకు కొన్నాళ్లు వెలుగు.. ఆ తర్వాత చీకట్లు ఉంటాయని తరచూ సీనియర్ నేతలు చెబుతుంటారు. అలాంటివారిలో ఒకరు కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలో లేకుండా కర్ణాటకలో చక్రం తిప్పిన నేత. అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. చాన్నాళ్లుగా రాజకీయాల్లో పెద్దగా వినిబడని పేరు గాలి జనార్థన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన మళ్లీ సొంతగూటికి చేరారు.
సోమవారం కర్ణాటక బీజేపీ మాజీ సీఎం ఎడియూరప్ప సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారాయన. మరి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? దీనికి సమాధానం చెప్పడం కష్టమే! రాజకీయాల్లో బళ్ళారి పేరు చెప్పగానే వినబడేది గాలి జనార్థన్‌రెడ్డి. ఈయనకు ఈ ప్రాంతం కంచుకోట. బళ్లారి నుంచి గాలి తరపున ఎవరైనా నిలబడితే విజయం కూడా వారిదే. ఆ రేంజ్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరించారు.
2009 నుంచి ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఆ స్థాయిలో రకరకాల సమస్యలు గాలిజనార్థన్‌రెడ్డిని వెంటాడాయి. ఓబులాపురం మైనింగ్ కేసు ఒకటైతే.. రెండోది జడ్జి ముడుపుల కేసు ఇవన్నీ ఆయన్ని బాగానే వెంటాడాయి. చివరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ మధ్యలో సొంతంగా పార్టీ పెట్టినా అదీ నామమాత్రమే అయ్యింది. కానీ పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. గాలి ఎఫెక్ట్ బళ్లారి ప్రాంతాల్లో బీజేపీపై చాలా ప్రభావం చూపింది.
Also Read: Purandeswari comments: అందుకోసమే త్రివేణి సంగమం.. అజెండా అదే..!
గత పదేళ్లుగా నేతలు మారారు.. రాజకీయాలు మారాయి. మళ్లీ పాతగూటికి చేరిపోయారు. బీజేపీ అంతా ఇప్పుడు మోదీ నామమే నడుస్తోంది. గాలి కూడా ఇదే పల్లవిని ఎత్తుకున్నారు. బీజేపీలో చేరగానే జనార్థన్‌రెడ్డి వెంట వచ్చిన తొలి పలుకులు కూడా అవే. ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తాను కేవలం బీజేపీ కార్యకర్తగా మాత్రమే పని చేస్తానని, ఎలాంటి షరతుల్లేకుండా పార్టీలో చేరినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు ఏ పదవులు వద్దని మనసులోని మాట బయటపెట్టారు. ఈసారి కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
రీసెంట్‌గా బీజేపీ విడుదల చేసిన జాబితాలో గాలి జనార్థన్‌రెడ్డి సన్నిహితుడు శ్రీరాములుకు సీటు వచ్చింది. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పేశాడు. కానీ, గాలి మద్దతుదారులు మాత్రం దీని వెనుక పెద్ద స్కెచ్ వుందని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల నుంచి గాలి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పాత గూటికి వెళ్లారని అంటున్నారు.
గతంలో కర్ణాటక సీఎంగా ఎడియూరప్ప ఉన్నకాలంలో గాలి మాటే చెల్లుబాటు అయ్యేది. సీట్లు, మంత్రి పదవులు ఇలా ఏది కావాలన్నా డిమాండ్ చేసి మరీ దక్కించుకునేవారు. కానీ, ప్రస్తుతం బీజేపీ ఆ పరిస్థితి లేదు. హైకమాండ్ మాట చెల్లుబాటు. అందుకు అనుగుణంగా ఉంటే అదృష్టం కలిసివచ్చినట్టే. మొత్తానికి రానున్న నాలుగేళ్లలో బళ్లారిని తన కంచుకోటగా మార్చుకునేందుకు గాలి రంగంలోకి దిగినట్టేనని చెప్పువచ్చు.