Dog Bite Victims: దేశవ్యాప్తంగా సవాలుగా మారిన వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్క కాటుకు గురైన బాధితులు (Victims) ఎలాంటి ముందస్తు డిపాజిట్ సొమ్ము చెల్లించకుండానే ఈ కేసులో నేరుగా జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుంటూ, “ఈ కేసులో బాధితుల వాదనలకు కూడా తప్పనిసరిగా అవకాశం ఉండాలి” అని పేర్కొన్నారు.
ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, “బాధితులు దాఖలు చేసిన ఇంటర్‌వెన్షన్ దరఖాస్తులను అనుమతిస్తున్నాము. వారు ఎలాంటి డిపాజిట్ చేయనవసరం లేదు” అని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో, ఈ సుమోటో కేసులో కుక్కల సంక్షేమానికి మద్దతు తెలిపే వ్యక్తులు రూ. 25,000, ఎన్జీఓలు రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు షరతు విధించింది. ఆ నిధులను కుక్కల సంరక్షణ వసతుల కోసం వాడాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో, కుక్క కాటు బాధితులకు ఈ షరతు నుంచి పూర్తి మినహాయింపు లభించింది.
Read Also: Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు
అంతేకాకుండా, భారత జంతు సంక్షేమ బోర్డు (Animal Welfare Board of India)ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలన్న సూచనను కోర్టు అంగీకరించి, వారికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లో కుక్కలకు ఆహారం అందించడంపై త్వరలో నియంత్రణ విధిస్తూ ఆదేశాలు ఇస్తామని జస్టిస్ నాథ్ సూచించారు. పెరుగుతున్న కుక్క కాటు ఘటనలు, ప్రజా అవగాహనపై కూడా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.