Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, పేదల హక్కులు అంశాలపై తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల మౌలిక హక్కులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, భవిష్యత్తు దిశగా ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో MGNREGAను రద్దు చేయడం ద్వారా.. మోదీ ప్రభుత్వం లక్షలాది పేదలు, బలహీన వర్గాలను నిరాశ్రయులుగా మార్చిందని ఖర్గే ఆరోపించారు. ఇది కేవలం పేదల కడుపులో తన్నడమే కాకుండా, వారి వెన్నుపోటు పొడవటంతో సమానమని వ్యాఖ్యానించారు. MGNREGAను రద్దు చేయడం జాతిపిత మహాత్మా గాంధీకి చేసిన అవమానమని స్పష్టం చేశారు.
సోనియా గాంధీ ఇటీవల రాసిన వ్యాసాన్ని ఉదహరిస్తూ, MGNREGA మహాత్మా గాంధీ సర్వోదయ దార్శనికతకు ప్రతిరూపం. ఇది రాజ్యాంగబద్ధమైన పని హక్కును అమలు చేసింది. ఈ పథకం రద్దు వల్ల రాబోయే సంవత్సరాల్లో శ్రామిక వర్గాలకు తీవ్రమైన ఆర్థిక, మానవ నష్టాలు కలుగుతాయి. మన హక్కులను కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసరం అని ఖర్గే పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల ప్రకారం.. UPA ప్రభుత్వం పని హక్కు, ఆహార హక్కు, విద్య హక్కు, ఆరోగ్య హక్కు వంటి కీలక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం పని హక్కుపై క్రమబద్ధమైన, క్రూరమైన దాడిని ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కంటే కొద్ది మంది పెద్ద పెట్టుబడిదారుల లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.
MGNREGA అనేది UPA ప్రభుత్వం చేపట్టిన దార్శనిక పథకం అని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తర్వాతే దీనిని మహాత్మా గాంధీకి అంకితం చేశామని ఖర్గే గుర్తు చేశారు. కానీ ఎలాంటి అధ్యయనం లేకుండా, రాష్ట్రాలను లేదా రాజకీయ పార్టీలను సంప్రదించకుండా, మోదీ ప్రభుత్వం దీనిని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం.. మూడు నల్ల వ్యవసాయ చట్టాల మాదిరిగానే జరిగిందని విమర్శించారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం అవసరమని పిలుపునిచ్చారు. 2015లో భూసేకరణ చట్టం సవరణకు కాంగ్రెస్ పోరాడి ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే విధంగా ప్రజల పోరాటంతోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, చివరకు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు.
MGNREGAపై కూడా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని రాహుల్ గాంధీ ఇప్పటికే అంచనా వేశారని తెలిపారు. రాజ్యాంగం గత 76 సంవత్సరాలుగా నియంతల నుండి ప్రజల హక్కులను కాపాడుతోందని, ఇప్పుడు వాటిని రక్షించుకోవడం మన సమిష్టి బాధ్యత అని ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా దృష్టి సారించిందని తెలిపారు. బెలగావి నుంచి ప్రారంభించిన “సంస్థ సృష్టి ప్రచారం”లో భాగంగా దాదాపు 500 జిల్లాల్లో కొత్త జిల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయని, మిగతా జిల్లాల్లో 120 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 2026లో జరగనున్న రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటి నుంచే ఐక్యంగా సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల పేర్లు తొలగించకుండా కాపాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. BJP, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందన్నారు.
Also Read: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్
ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థల దుర్వినియోగం, నేషనల్ హెరాల్డ్ కేసు వంటి అంశాలపై కూడా స్పందించారు. “సత్యమేవ జయతే” అనే నమ్మకంతో న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. చివరగా, MNREGAతో పాటు ఇతర కీలక అంశాలపై కార్యాచరణ ప్రణాళికపై నేతలు సూచనలు ఇవ్వాలని ఖర్గే కోరారు.