Cloud Burst: వర్షా కాలం వచ్చింది అంటే అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎప్పుడెప్పుడు వాన పడుతుందో చెప్పలేం, పడితే మాత్రం అది మామూలు వర్షం కాదుగా – అది ప్రకృతి చూపించే కోపం లాంటిది. ఒక్కసారిగా ఊపిరి తీసుకోలేనంతగా కురుస్తుంది. పర్వతాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లోనూ ఇది మరింత భయంకరంగా మారుతుంది. ఇళ్లు చెరిపేసే వర్షం, ఊర్లను మింగేసే వరద, మనుషులను గాలిలో కొట్టేసే ప్రవాహం – ఇవన్నీ ఒక్క వానకే గుర్తులు.
వర్షపు ఈ భీభత్సం మన జీవితాలను ఒక్క క్షణంలో మారుస్తుంది. అందుకే వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం, ముందస్తుగా సిద్ధపడటం ఎంతో అవసరం. అలాంటి విపత్తుల్లో అత్యంత భయంకరమైనది క్లౌడ్‌బరస్ట్. అంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి ప్రళయం విరుచుకుపడినట్టు భారీ వర్షం కురవడం. పరిమిత కాలానికి, స్థలానికి, అపరిమిత విధ్వంసానికి పేరు క్లౌడ్‌బరస్ట్. ఇది సునామీ కంటే అత్యంత ప్రమాదకం అని నిపుణుల వివరణ.
క్లౌడ్‌బరస్ట్ అంటే..
ఇది సాధారణ వర్షం కాదు. ఇది మామూలు గాలి కాదు. మేఘాల విస్పోటము చెంది నీటి ప్రళయం లాంటిది. ఒక్క గంటలో వంద మిల్లీమీటర్లకన్నా ఎక్కువ వర్షం కురవడమే కాకుండా.. ఒక చిన్న పరిధిలో — 20 లేదా 30 చ.కిమీ ప్రాంతం లోపలే. ఇది ఏ సమయంలోనైనా, ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాని ఎక్కువగా కొండలు, పర్వత ప్రాంతాల్లోనే ఇది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ తేమతో నిండిన గాలి కొండలతో ఢీకొని పైకి వెళ్లినప్పుడు చల్లబడుతుంది, కండెన్స్ అవుతుంది. అలా ఆకాశంలోనే నీటి మేఘాలు గడ్డకట్టి చివరకు… ఆ మేఘాలు ఒక్కసారిగా ఉప్పెనలా భూమి మీదకు విరుచుకుపడతాయి.
ఈ క్లౌడ్‌బరస్ట్ హఠాత్‌గా వస్తుంది. ముందుగా హెచ్చరిక చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది లోకలైజ్డ్ ఈవెంట్ – అంటే చిన్న చిన్న ప్రాంతాల్లోనే జరిగేది. డాప్లర్ రాడార్, శాటిలైట్ టెక్నాలజీ ఉన్నా, ఇది ఎప్పుడూ తప్పనిసరిగా అంచనా వేయలేం. కానీ దీని ఫలితాలు మాత్రం అంతే భయానకంగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో వర్షం పడుతుంటే కొండల మధ్యలో ఉన్న లోతైన ప్రాంతాలు జలమయమవుతాయి. ఎత్తు నుంచి వచ్చిన నీరు భయంకరంగా మారి.. ఎదురుగా ఉన్న వస్తువులు, జీవులను, మనషులను నీటి ప్రవాహంతో కొట్టుకుపోతాయి. ఇది ఒక రకం ఫ్లాష్ ఫ్లడ్. దారులు, వంతెనలు, ఇళ్ళు – ఏదీ ఉపేక్షించదు.
క్లౌడ్‌బరస్ట్ సునామీ కంటే ప్రమాదమా?
సునామీ ఎప్పుడూ వస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ సునామీ వచ్చే అవకాశాలు ఉన్న కొన్ని సాధారణ కారణాలు, సంకేతాలు ఉంటాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, లేదా సముద్రపు అడుగున కొండచరియలు విరిగిపడటం వంటివి సముద్రపు నీటిని భారీగా కదిలించినప్పుడు సునామీ సంభవించే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా.. సునామీకి ముందు కొన్నిసార్లు బలమైన భూకంపం, సముద్రం నుంచి వినిపించే గర్జనలాంటివి లేదా సముద్రజలాలు అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోవడం వంటి సంకేతాలు కనిపించొచ్చు.
కానీ క్లౌడ్‌బరస్ట్ విషయంలో అలాంటి స్పష్టమైన సంకేతాలు ఉండవు. అది ఎప్పుడు, ఎలా, ఎంత తీవ్రతతో కురుస్తుందో ముందుగా చెప్పడం చాలా కష్టం. చిన్న పరిధిలో, తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో వర్షం కురిసి, అనూహ్యంగా ప్రళయంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై ఎక్కువగా పరిశోధనలు చేస్తూ, క్లౌడ్‌బరస్ట్ వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఇండియాలో గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా?
2010లో లద్దాఖ్‌లో జరిగింది. ఆ ఎండమావుల ప్రాంతంలో ఒక్కసారిగా మబ్బులు వచ్చాయి. మూడు గంటల్లో 250 మి.మీ వర్షం పడింది. ఊర్లు మాయం. దారులు మాయం. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు పోయాయి. అక్కడి ప్రజల జీవితాల్లో ఆ రోజు ఆకాశమే శత్రువయ్యింది.
2013లో ఉత్తరాఖండ్ లో మరో మాయాజాలం. కేదార్‌నాథ్ దగ్గర పెద్ద సంఖ్యలో యాత్రికులు ఉన్న సమయంలో… వరుసగా క్లౌడ్‌బరస్ట్‌లు. 5700 మందికిపైగా ప్రాణాలు పోయాయి. దేవాలయం ముందు నిలిచిన ఊరు రాంబారా – పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. ఇది ప్రకృతి చూపిన విలయ తాండవం.
2005 లో భారతదేశపు ఆర్థిక రాజధానిగా పేరున్న ఈ మహానగరం ముంబాయి ఆ రోజు పూర్తిగా స్తంభించిపోయింది. ఒక్క రోజులోనే 944 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల్లోనే 650 మి.మీ. ఊహించుకోండి, మోకాళ్ల లోతు నీరు కాకుండా, ఛాతి వరకు నీరు వచ్చేసి, రోడ్లు, వీధులు అన్నీ నీటిలో కలిసిపోయిన భయానక దృశ్యం. వేలాది ప్రాణాలు పోయాయి. ఒక రోజు నగరం నిశ్శబ్దమైంది.
ఇలాంటి సంఘటనలు ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా జరిగాయి. అంతే కాకుండా.. 2011లో డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లో 150 మి.మీ వర్షం పడి రెండు గంటల్లో నగరం భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది – బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. జీవనాధారం పూర్తిగా స్థంభించిపోయింది.
ఇదే 2023లో హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. కుల్లు, మండీ జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది. మామూలు వర్షం కాదు – భూమి తట్టుకోలేనంతగా వర్షపు ప్రవాహం పోటెత్తింది. 20 మందికి పైగా ప్రాణాలు పోయాయి. పండ్ల తోటలు నాశనం. వంతెనలు ఊడిపోయాయి. 700 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
ఇప్పుడు ప్రశ్న – ఈ క్లౌడ్‌బరస్ట్‌ను నివారించలేమా?
సూటిగా చెప్పాలంటే – నివారించలేం. కానీ మనం చేస్తే నష్టాన్ని తగ్గించవచ్చు. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు బలపడాలి. నగరాల Drainage వ్యవస్థలు మెరుగవ్వాలి. అరణ్యాలను నరికడం తగ్గించాలి. కొండలపై నిర్మాణాల్ని ఆపాలి. ఎత్తైన బిల్డింగులు… బలహీనంగా నిర్మించి, వరదలు వచ్చినప్పుడు తట్టుకోలేక విరిగిపోయే వంతెనలు… ఇవన్నీ పునర్నిర్మించాలి. అప్పుడే మనం ఈ క్లౌడ్ బర్స్‌ట్ ను విలయం నుంచి ఆపగలం.