Supreme Court: వీధి కుక్కల కేసులో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సహా, పలు రాష్ట్రాల సిఎస్ లు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులపై సకాలంలో అఫిడవిట్లు దాఖలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎస్ లు క్షమాపణ చెప్పినట్లు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టుకు తెలియజేశారు.
వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు ఏపీ సహా పలు రాష్ట్రాల సిఎస్ లను హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎస్ లు కోర్టు ముందు హాజరయ్యారు. తమ తీర్పును ఎందుకు అమలు చేయలేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ను జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించారు. అక్టోబర్ 29న అఫిడవిట్ దాఖలు చేశామని ఏపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి పలు కీలక అంశాలపై చార్ట్ రూపొందించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి సూచించారు.
ఆయా రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా చార్ట్ తయారు చేయాలని అమికస్ క్యూరీ గౌరవ అగర్వాల్ ను సుప్రీంకోర్టు కోరింది. కుక్కకాటు బాధితులను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయకపోతే సిఎస్ లు మరోసారి కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్ 7 కి వాయిదా వేసింది. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడికి చిన్నారులు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. దేశంలో వీధి కుక్కల భారిన పడ్డ చిన్నారులు రెబీస్ వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డారు. వీటిపై స్పందించిన సుప్రీం కోర్టు, సుమోటాగా ఈ కేసును జూలై 28న స్వీకరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏబీసీ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆగస్టు 22న సుప్రీం కోర్టు ఆదేశించింది.ఏబీసీ నిబంధనలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తే పిల్లలు రేబిన్ లాంటి వ్యాధుల నుంచి రక్షంచబడుతారని పేర్కొంది.